దశాబ్ది వేడుకలు  ఘనంగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్ శశాంక

దశాబ్ది వేడుకలు  ఘనంగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్ శశాంక

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మహబూబాబాద్ ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో దశాబ్ది వేడుకల నిర్వహణ ఏర్పాట్లు తీరుతెన్నులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక నివేదిస్తూ... గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళిక బద్ధంగా అధికారులను నియమించామని ప్రతి కార్యక్రమాన్ని పండుగలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో 82 రైతు వేదికలు ఉన్నాయన్నారు.

మామిడి తోరణాలతో ముగ్గులతో రంగ రంగ వైభవంగా అలంకరించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాలలో  ప్రజా ప్రతినిధులు రైతుల సహకారంతో  ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అలంకరింపజేసి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రైతు బీమా లబ్ధిదారులను గుర్తించి రైతు వేదికలలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సభల నిర్వహణ, భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విభజన చేసి నిర్వహణకై అధికారులకు అప్పజెప్పమన్నారు. రైతు దినోత్సవం, సాగునీటి దినోత్సవం, చెరువులపండగ, తెలంగాణ పల్లెప్రగతి, పట్టణప్రగతి, మంచినీళ్లపండగ, హరితోత్సవం, కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపడతామన్నారు. సాంస్కృతి కార్యక్రమాలలో కోలాటం, గిరిజననృత్యాలు, బోనాలు,బతుకమ్మలు, డప్పులవిన్యాసం, ముగ్గులకార్యక్రమం, మామిడితోరణాలు వంటి కార్యక్రమాలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొల్పుతామన్నారు.


ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ఉత్తమంగా రాణించిన ఉద్యోగులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. సఫాయిఅన్నా..సలాం అన్నా అనే నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా పారిశుద్ధ కార్మికులను సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతిలో గ్రామపంచాయతీలలో జాతీయజెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. అమరవీరుల త్యాగాలను పాఠశాలల్లో విద్యార్థులకు బోధింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తామని, ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై వీడియో, ఫోటోలు తీయించి నివేదికల ద్వారా సమర్పిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో పండుగ వాతావరణం కనిపించాలని దశాబ్దకాల అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, డేవిడ్, జెడ్పీసీఈవో రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, ఆర్డీవోలు, జిల్లాఅధికారులు తదితరులు పాల్గొన్నారు.