మంచిర్యాల - వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి పెద్దపల్లి జిల్లాలో భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి...

మంచిర్యాల - వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి పెద్దపల్లి జిల్లాలో భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి...

 భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పన పై సంబంధిత అధికారులతో సమీక్షలో

జిల్లా అదనపు కలెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలు శనివారం లోగా సంబంధిత నివేదికలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి భూ సేకరణ సర్వే ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్-మంచిర్యాల మధ్య 4 వరుసల గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి కోసం పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లో అవసరమైన భూ సేకరణ చేపట్టుటకు సర్వే చేసి ప్రతిపాదనలను శనివారం నాటికి సిద్ధం చేయాలని, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మిషన్ భగీరథ ఇంట్రా, ఉద్యానవన శాఖ అధికారులతో జాతీయ రహదారి నిర్మించడం వల్ల ఆయా శాఖల పరిధిలో కలిగే నష్టాలకు, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, అదే విధంగా సేకరించాల్సిన భూమి , రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, తదితర అంశాలపై సంపూర్ణ నివేదిక రూపొందించాలన్నారు.

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే 455 మంది రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 36 కోట్లు మంజూరు చేసిందని, రామగిరి, ముత్తారం, మంథని తహసిల్దారులు సంబంధిత రైతుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి శనివారం నాటికి సమర్పించాలని, రైతులకు నష్టపరిహారం సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్.,ఆర్.అండ్ బి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.