రామగుండంను మహానగరం గా తీర్చిదిద్దుతాం..

రామగుండంను మహానగరం గా తీర్చిదిద్దుతాం..
  • నగర విస్తరణకు కొత్త పరిశ్రమలను తీసుకువస్తాం
  • రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
  • రూ.211 కోట్ల బడ్జెట్ కు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం


ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:  రామగుండం నగరాన్ని మహా నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని స్థానిక శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో గురువారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులoతా సమిష్టిగా, సమైక్యంగా నగరాభివృద్ది పై దృష్టి సారించాలని అన్నారు. నగరాన్ని అభివృద్ది చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయించే భాద్యత తాను తీసుకుంటానని అన్నారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన రామగుండం నగరంలో  గత కొంత కాలంగా ఓపెన్ కాస్ట్ లతో , మూత పడిన పరిశ్రమలతో ఉద్యోగాలు దొరక్క  జనాభా తగ్గుతోందని అన్నారు.  ఎన్ టి పి సి లో కొత్త ప్లాంట్ ల ఏర్పాటు , జెన్ కో ప్లాంట్ పునరుద్దరణతో పాటు ఇంకా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించి నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రామగుండం సమస్యలు అనేకం ప్రస్తావించానని అన్నారు.

జిల్లా మంత్రి శ్రీధర్ బాబు , ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల సహకారంతో రామగుండం నగరానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి సంపూర్ణంగా అభివృద్ది చేయడానికి శాయ శక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. స్థానిక ప్రభుత్వ రంగ సంస్థల సి ఎస్ ఆర్ నిధులు కూడా  గతంలో లాగా ఇతర ప్రాంతాలకు తరలి పోకుండా రామగుండం నియోజక వర్గ అభివృద్ది కి వెచ్చించేలా చేస్తానని అన్నారు. అలాగే స్థానిక పరిశ్రమల ద్వారా ఒక మిలియన్ చెట్లు పెంచేలా చర్యలు తీసుకొని కాలుష్యం తగ్గించే దిశగా కృషి చేస్తానని అన్నారు.

నగర ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీ నగర్ ను సంపూర్ణంగా అభివృద్ది చేసి ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మొదటి విడతగా డి ఎం ఎఫ్ టి నిధులు రూ 10.00 కోట్లు లక్ష్మీ నగర్ అభివృద్దికే కేటాయించడం జరిగిందని అన్నారు. మరో రూ. 29.00 కోట్ల తో నియోజక వర్గంలో వివిధ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. టి యు ఎఫ్ ఐ డి సి రూ 100 కోట్లు , అమృత్ 250 కోట్లతో నగరం లో రోడ్లు ,కాలువల నిర్మాణo తో పాటు గోదావరి లో మురుగు నీరు చేరకుండా ఎస్ టి పి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ లో పారిశుద్ధ్య నిర్వహణకు మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య పని వారికి అవసరమైన రక్షణ వస్తువులు , పని ముట్లు ఇవ్వాలని అన్నారు. రోడ్ లపై పశువులు తిరగకుండా అరికట్టాలని అన్నారు. 


నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో పరస్పర సహకారం అవసరమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. బడ్జెట్ ప్రసంగం లో భాగంగా ఆయన మాట్లాడుతూ  ప్రతిపాదించిన అభివృద్ది పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్పొరేటర్లు , అధికారులు సహకారం అందించాలని కోరారు. స్థానిక శాసన సభ్యులు , జిల్లా మంత్రి వర్యులు , జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర అభివృద్దికి  సహకారం అoదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నగర పాలక సంస్థ పై ఆర్థిక భారం పడకుండా సింగరేణి  తదితర సంస్థలతో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు చేయించినందుకు ఎం ఎల్ ఎ కు కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని  గతంలో కంటే బడ్జెట్ అంచనాలను కొద్దిగా తగ్గించినట్లు తెలిపారు.  ఖర్చులకు తగినట్లుగా మున్సిపల్ ఆదాయం లేనoదున నూతన ఆదాయ  మార్గాలను సూచించాలని కోరారు. కొంతమంది రేకుల షెడ్ లను పక్కా భవనాలుగా మార్చుకున్నా , పై అంతస్తులు నిర్మించుకున్నప్పటికీ పన్ను మారలేదని  దృష్టికి తెచ్చిన నేపధ్యంలో ఏప్రిల్  1 తరువాత మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి  సర్వే చేసి పన్నుమొత్తాలను పునః సమీక్షించాలని కోరారు. రామగుండం నగరాన్ని అభివృద్ది చేయడానికి  అవసరమైన నిధులను మంజూరు చేయించడానికి ఎం ఎల్ ఎ. ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. డి ఎం ఎఫ్ టి , టి యు ఎఫ్ ఐ డి సి , అమృత్ నిధులతో  డివిజన్ లలో అభివృద్ది పనులు పూర్తవుతే రామగుండం రూపు రేఖలు మారి పోతాయని అన్నారు. 


రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ . శ్రీకాంత్ మాట్లాడుతూ శాసన సభ్యులు , మేయర్  ఆలోచనలకు అనుగుణంగా ,  పాలక వర్గ సభ్యుల సహకారంతో భాద్యతగా పని చేస్తామని అన్నారు. అభివృద్దికి సంబందించి అందరితో చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు. కాగా 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రూ. 211 కోట్ల 22 లక్షల 27 వేల అంచనా లతో రూపొందించిన బడ్జెట్ కు సమావేశంలో ఏక గ్రీవంగా ఆమోదం తెలిపారు. అంచనా వ్యయం 196 కోట్ల 42 లక్షల 41 వేల రూపా యలు కాగా మిగులు రూ, 14 కోట్ల 79 లక్షల 86 వేల రూపాయలుగా ప్రతిపాదించారు. 

ఈ  సమావేశంలో  కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో పాటు డిప్యూటీ  కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, సెక్రెటరీ రాజు, అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు,  ఎస్ఇ చిన్న రావు,  ఇఇ సుచరణ్, ఎగ్జామినర్ షేక్ మస్తాన్ ఖాజా, సూపరింటెండెంట్ మనోహర్,  అకౌంట్స్ ఆఫీసర్ అర్చన, అకౌంటెంట్ నాగరాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు