గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలి...

గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలి...
  • తడి, పొడి చెత్త ఇంటి వద్దే వేరు చేయడం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
  • జి.పి.డి.పి జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ఒకే రోజు మార్పు సాధ్యం కానప్పటికి నిరంతరాయంగా కృషి చేయడం వల్ల రాబోయే 6 నెలలు, సంవత్సర కాలంలో అద్బుత ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరం లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం, జి.పి.డి.పి శిక్షణా కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ గ్రామంలో నివసించే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉందని, జిల్లాలో పారిశుధ్య నిర్వహణ పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది మంచి పనితీరు కనబరుస్తున్నారని, భవిష్యత్తు కాలంలో మరింత మెరుగైన దిశగా పారిశుధ్య నిర్వహణ చేయుటకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ అత్యంత ప్రాధాన్యత అంశం అని, ప్రతి గ్రామంలోని వార్డుల వారీగా పారిశుద్ధ్య ప్లాన్ రూపొందించుకోవాలని, మన దగ్గర అందుబాటులో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కదలిక మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. 

గ్రామంలో చెత్తను బయట వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి వార్డులో చెత్త సేకరించే ట్రాక్టర్ ఎప్పుడు వస్తుంది అనే అంశంపై ప్రజలకు అవగాహన ఉండే విధంగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త బయటకు వేయకుండా జాగ్రత్త వహించన్నారు. చెత్త సేకరణ సమయంలో తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలంటే తప్పనిసరిగా ఇంటి వద్ద నుంచే ప్రజలు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సి ఉంటుందని, తడి, పొడి చెత్తపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఒకే రోజు మార్పు సాధ్యం కానప్పటికి నిరంతరాయంగా కృషి చేయడం వల్ల రాబోయే 6 నెలలు, సంవత్సర కాలంలో అద్బుత ఫలితాలు వస్తాయని తెలిపారు. గ్రామంలో స్వయం ఉపాధి మహిళలు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధుల ద్వారా తడి, పొడి చెత్త వేర్వేరు చేయడం వల్ల కలిగే లాభాలు ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని, తడీ, పొడి చెత్త వేర్వేరుగా ఎలా గుర్తించాలి అనే అంశాలపై ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. గ్రామంలో ముందస్తుగా ఉత్సాహవంతంగా పనిచేసే వార్డు సభ్యుల  వార్డును ఎంపిక చేసి ఆదర్శవంతమైన వార్డుగా తయారు చేయాలని సూచించారు. 

తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించడం వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం సైతం సమకూరుతుందని కలెక్టర్ తెలిపారు. తడి చెత్తతో ఎరువులు తయారు చేసి గ్రామంలోని రైతులకు తక్కువ ధరకు సరఫరా చేయవచ్చని అన్నారు. ప్రతి మండలంలో రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి పొడి చెత్తను సేకరించి  పంచాయతీకి ఆదాయం సమకూర్చవచ్చన్నారు. గ్రామాలలో నిర్మించిన డంప్ షెడ్లకు అప్రోచ్ రోడ్డు ఉండాలని, లేనిపక్షంలో ఉపాధి హామీ నిధుల క్రింద సిసి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల మండలాల వారీగా ప్రతివారం రివ్యూ సమావేశం నిర్వహించాలని, ప్రతి రెండు వారాలకు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి పురోగతి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, సి.పి. ఓ. రవీందర్, మునిసిపల్ కమిషనర్ లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శిలు మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.