పాలమూరు న్యాయ యాత్రకు ప్రజల నీరాజనం

పాలమూరు న్యాయ యాత్రకు ప్రజల నీరాజనం
  • పదేళ్ల బిఆర్ స్ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని నష్టం
  • పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి

ముద్ర (షాద్ నగర్ ) : ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ యాత్ర కు మద్దతుగా సి డబ్ల్యూ సి కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి సారథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గంలోచెప్పట్టిన న్యాయయాత్రకు  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ప్రారంభమైన న్యాయ యాత్ర రెండవ రోజు మంగళవారం కొందుర్గు మండలంలోని తంగేడుపల్లి, ఆగిర్యాల, పాత ఆగిర్యాల, వెంకీర్యాల గ్రామాలలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గం లో  చేపడుతున్న న్యాయ యాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలుకుతున్నారని అన్నారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీరని నష్టం జరిగిందని, గత పాలకుల నిర్ణయాలతో నియోజకవర్గం లో తాగు,  సాగు నీళ్లు లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని  ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ఆయన విమర్శించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని దగ్గరుండి కట్టి లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూయించి గద్దెనెక్కారని విమర్శించారు. ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఏనాడు పాలమూరు సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తింది లేదని అన్నారు. పాలమూరు జిల్లా వాసుల హక్కులపై పోరాడి సాధించే యువ నాయకుడు చల్లా వంశీ చందర్ రెడ్డి అని, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలంటే వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందనిఆయన ప్రజలను కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని జితేందర్ రెడ్డి తెలిపారు.