క్షణం క్షణం.... ఉత్కంఠ భరితం

క్షణం క్షణం.... ఉత్కంఠ భరితం
  • కామారెడ్డి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
  • ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్
  • జోరుగా సాగుతున్న బెట్టింగ్
  • ఉద్దండుల పోరులో.. గెలిచేది ఎవరో?

ముద్ర  ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.  అభ్యర్థుల గెలుపు కూటములపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన వరుసగా రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఆధిక్యత ను కొంసాగించగా, ఈ సారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో బిఆరెస్, ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందగా, ఎమ్మెల్యే సురేందర్ ఆ పార్టీని వీడి బిఆరెస్ లో చేరారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో జిల్లా లోని 4 నియోజకవర్గాల్లోను త్రిముఖ పోటీ నెలకొంది.  

కామారెడ్డి నియోజకవర్గంలో బిఆరెస్ తరుపున సీఎం కేసీఆర్, కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి తరపున కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి పోటి చేస్తుండగా, ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   ఇక్కడి ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించనున్నాయి.  ఎల్లారెడ్డి లో బిఆరెస్ తరపున ఎమ్మెల్యే జాజుల సురేందర్, కాంగ్రెస్ తరపున మదన్ మోహన్ రావు, బీజేపీ తరపున వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పోటి చేస్తుండగా, కాంగ్రెస్, బిఆరెస్ మధ్యే తీవ్రమైన పోటి నెలకొంది.  జుక్కల్ నియోజకవర్గంలో బిఆరెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే హాన్మంత్ షిండే, కాంగ్రెస్ తరపున లక్ష్మి కాంత్ రావు, బీజేపీ తరపున అరుణ తార పోటి చేస్తుండగా, ఇక్కడ త్రిముఖ పోటి నెలకొంది.  బాన్సువాడ నియోజకవర్గంలో బిఆరెస్ తరపున అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయన పోటీ చేస్తుండగా ఇక్కడ త్రిముఖ పోటి నెలకొంది.   ఆయా నియోజక వర్గాల్లో 70 నుంచి 80 శాతం పోలింగ్ జరగడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోననే ఉత్కంఠ నెలకొంది.   కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి ఉద్దండులు  పోటీ చేయడంతో పోలింగ్ ముందు, తర్వాత కూడా  తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్నవారు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలతో పాటు కార్యకర్తల్లో టెన్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ క్షణాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.   ఇదిలావుండగా అభ్యర్థుల గెలుపు ఓటములపై ఇప్పటికే లక్షల్లో బెట్టింగ్ కొనసాగుతోంది.                              

కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో ఆదివారం కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఎన్నికలను కౌంటింగ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని ఓట్లను 19 రౌండ్లలో లెక్కిస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఓట్లు 20 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఓట్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని పాలిటెక్నిక్ కళశాల లో లెక్కించనున్నారు.