మాజీ మంత్రి పి నర్సారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి పి నర్సారెడ్డి కన్నుమూత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు పి నర్సారెడ్డి (92) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్ను మూశారు. వయోసంబంధమైన సమస్యలతో ఆయన కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. 22 సెప్టెంబర్ 1931 లో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి లో ఆయన జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన 1967లో నిర్మల్ ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1967 నుండి 1982 వరకు ఎమ్మెల్యే గా కొనసాగారు. 1991 లో ఆదిలాబాద్ ఎంపి గా విజయం సాధించారు. జలగం వెంగళరావు మంత్రి వర్గంలో 1978 లో ఆయన రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు. 1971-72 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ పి సి సి అధ్యక్షునిగా కూడా పని చేశారు. 

మాజీ మంత్రి అల్లోల సంతాపం

మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పి. న‌ర్సారెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించిన న‌ర్సారెడ్డి మృతి తెలంగాణ రాష్టానికి , ముఖ్యంగా నిర్మ‌ల్ జిల్లాకు తీర‌ని లోటన్నారు. నిర్మ‌ల్ ప్రాంత వాసిగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని ఆయ‌న చేసిన‌ సేవ‌ల‌ను కొనియాడారు. న‌ర్సారెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. అధికారిక లాంఛ‌నాల‌తో న‌ర్సారెడ్డి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.