కాంగ్రెస్ లోకి గంగుల ?

కాంగ్రెస్ లోకి గంగుల ?
  • అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి
  • పొన్నంతో చర్చల కోసం జర్నలిస్టుల మధ్యవర్తిత్వం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
  • రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తాజా మాజీ మంత్రి, కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కరీంనగర్ లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, మరో మారు మంత్రి పదవి చేపట్టి కరీంనగర్ కు అత్యధిక నిధులు రాబట్టే అవకాశం ఉంటుందని, ఆ దిశగా గంగుల ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటున్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్న మాట. టిడిపి పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలిసి పని చేసిన విషయం విధితమే. ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి టిడిపిలో కొనసాగగా గంగుల కమలాకర్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రతిహాస విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని గంగుల నిర్ణయానికి వస్తే చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన  ఇరుపార్టీలలో నెలకొంది.

పొన్నంతో జర్నలిస్టుల మధ్యవర్తిత్వం

హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ ల మధ్య చర్చల కోసం జర్నలిస్టులు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు వినికిడి. గంగుల కమలాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా? ఒకవేళ ఇవ్వకుంటే పొన్నం ప్రభాకర్ తో చర్చల కోసం  జర్నలిస్టులతో మధ్యవర్తిత్వానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తుంది. దీనిపై పొన్నం ప్రభాకర్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడన్న వార్త ప్రచారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పొన్నం ప్రభాకర్ ను రాజకీయంగా అనగదొక్కాలని చూసిన గంగులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఎలా ఇస్తుందో మేము చూస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగుల కాంగ్రెస్ లో చేరితే తమ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీని కాంగ్రెస్ లో గంగుల చేరిక ఎంతవరకు నిజమో అటు పొన్నం ఇటు గంగల తేల్చి ప్రచారానికి తెర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.