ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలి

ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలి
  • అనుమతి లేని ఆసుపత్రులను మూసివేయాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు, డాక్టర్లు రోగుల నుండి ఇష్టా రీతిలో డబ్బులు వసూలు చేస్తున్న ఆస్పత్రులతో పాటు  అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులను వెంటనే మూసివేయాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.  ఆదివారం ముకుంద లాల్ భవన్లో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లే మెడికల్ షాపులు, ల్యాబులు నిర్వహిస్తూ అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ రోగుల నుండి డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులతో కుమ్మక్కై స్కానింగ్ లకు రోగి చెల్లించే డబ్బుల్లో సగం డాక్టర్లు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.  

అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ రోగుల పాలిట శాపంగా మారుతున్నారని అన్నారు.  జిల్లాలో మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండా షాపులు నడుపుతున్నప్పటికీ జిల్లాలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడని, అందుకు కారణం ప్రతి మెడికల్ షాప్ నుండి ప్రతి నెల మాముళ్ళు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా డాక్టర్లు రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడికల్ షాపుల్లో ఉండే మందులు ఇవ్వకుండా తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులను అంటగడుతూ పెద్ద ఎత్తున మెడికల్ షాప్ నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారని దుయ్యబడ్డారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతి లేని ప్రైవేట్ హాస్పటల్ నోటీసులు ఇచ్చినప్పటికీ వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

అనుమతి లేని ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్పారని బహిరంగ విమర్శలు ఉన్నాయన్నారు.  వివిధ రకాల ఆపరేషన్లు, టెస్టులకు ఎవరికి తోచిన విధంగా వారు ధరలు నిర్ణయిస్తూ రోగులను పీల్చుకు తింటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని టెస్టులు అట్లాగే ఆపరేషన్ల ఫీజులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.  జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరిండెంట్ సొంతంగా ప్రవేట్ హాస్పిటల్ నెలకొల్పి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను తన ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తూ రోగుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొన్ని హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని అలాంటి హాస్పిటల్స్ పై నిఘా పెట్టి బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకొని, హాస్పిటల్ మూసివేయాలని డిమాండ్ చేశారు.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ ప్రైవేటు హాస్పటల్ నడపడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను తమ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ నడిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొని ఎడల సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్ సుంకరి సంపత్ డి నరేష్,పూజ, నాయకులు శ్రీకాంత్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.