తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన హరీష్ రావు

తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి  విగ్రహాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్  మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు, మన గ్రామలు అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దివ్యాంగుల పెన్షన్, కేసీఆర్ కిట్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామన్నారు. 

మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆర్. కాని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు.ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతాం,  బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు అన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతాం.