హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్

హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్
  • ఎసిపి శ్రీనివాసరావు వెల్లడి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి లో గత నెల 25 న జరిగిన హత్య కేసులో భార్య, భర్తలు చిక్కుడు మమత నాగరాజు లను అరెస్టు చేసినట్టు స్టేషన్ ఘన్ పూర్ ఎసిపి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శివుని పల్లికి చెందిన  చిక్కుడు నాగరాజు హమాలిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తీగల కరుణాకర్ హైదరాబాద్ లో రెడీమిక్స్ కంపెనీ సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. వీరి వ్యవసాయ భూములు పక్క పక్కన ఉండడంతో మృతుడు తీగల కరుణాకర్ కు, చిక్కుడు నాగరాజు భార్య చిక్కుడు మమత కు పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీస్తుంది.  

విషయం తెలుసుకున్న నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆగస్టు 25 న చిక్కుడు మమతతో ఫోన్ చేయించి శివునిపల్లి శివారులోని మామిడి తోటకి రాత్రిపూట రప్పించిన నాగరాజు తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కరుణాకర్ చనిపోయినట్లు  నిర్ధారించుకొని భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వెళ్లి భార్య మమతను ఇంటి వద్ద వదిలి వచ్చి  కరుణాకర్ బైకును శివుని పల్లి చెరువులో పడేశాడు. తనతో తెచ్చుకున్న చేపల వాళ్లతో మృతుడు కరుణాకర్ణ ను చుట్టి టీవీఎస్ ఎక్సెల్ పై వేసుకుని వచ్చి నమిలికొండ చెరువులో వదిలేశాడు. మృతుడి ఫోను జాఫర్గడ్ మండలం తమ్మడపల్లి శివారులో పగలగొట్టి కాల్చి వేసినాడు. మృతుడి చనిపోయిన ప్రదేశంలో రక్తం మరకలు కనబడకుండా పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టి ఎవరికి అనుమానం రాకుండా చేసినట్లు తెలిపారు. హత్య చేసిన విషయం ఎలాగైనా బయటపడుతుందన్న భయంతో నిందితులు ఇద్దరు మధ్యవర్తి ద్వారా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయినట్లు ఏసీపి  తెలిపారు. కరుణాకర్ ను చంపడానికి ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకుని నిందితుల అరెస్టు చేసినట్లు ఏసిపి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో సిఐ అల్లె రాఘవేందర్, ఎస్సై నాగరాజు,  ఏఎస్ఐ రాజమౌళి, పీసీలు కుమారస్వామి, రవి ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.