ఐపీఎల్​ 45 కోట్లమంది వీక్షణ

ఐపీఎల్​ 45 కోట్లమంది వీక్షణ
  • అంబానీ వెల్లడి
  • 45 కోట్ల వ్యూయర్స్​తో అంతర్జాతీయ రికార్డు

ముంబై: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ను జియో సినిమాలో ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ ప్లాట్‌ఫాంలో ఐపీఎల్‌ను 45 కోట్ల మంది వీక్షించారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది గ్లోబల్ రికార్డు అని తెలిపాడు. రిలయన్స్ 46వ వార్షిక జనరల్ మీటింగ్‌లో అంబానీ ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం. ఇలాంటి ప్రదర్శనతో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై జియో సినిమా అత్యద్భుతమైన ప్రభావం చూపిందని అంబానీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ను ఎక్కువ మంది టీవీల్లో చూడలేదని, మొబైల్ వంటి డిజిటల్ డివైజుల్లోనే చూశారని కూడా తెలిపాడు. 'ఐపీఎల్‌ను జియో సినిమాలో మొట్టమొదటిసారి స్ట్రీమ్ చేయడం జరిగింది. ఇది ఏకంగా 45 కోట్ల వ్యూయర్స్‌తో అంతర్జాతీయ రికార్డు సృష్టించింది' అని అంబానీ తెలియజేశాడు.

'ఈ వ్యూయర్స్‌లో ఎక్కువ మంది టీవీల్లో కాకుండా డిజిటల్ డివైజుల్లో ఐపీఎల్ చూశారు. దీంతో భారత్‌లో కంటెంట్‌ను చూసే విధానంలో భారీ మార్పు వచ్చింది' అని వివరించాడు. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ అయితే చాలా రికార్డులు బద్దలు కొట్టిందని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను 120 కోట్ల మంది ఐపీఎల్ ఫైనల్ చూశారట. సగటున 60 నిమిషాలపాటు ఈ మ్యాచ్ చూసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా జియో తీసుకొచ్చిన ఏఆర్/వీఆర్ డివైజ్ జియో డైవ్ కూడా ఇలా ఇంటి దగ్గర నుంచి స్పోర్ట్స్ చూడటాన్ని రివల్యూషనైజ్ చేసిందని అంబానీ చెప్పాడు. ఈ డివైజులతో ఇంట్లో ఉండే ప్రేక్షకులకు కూడా 360 డిగ్రీల్లో స్టేడియం తరహా అనుభూతి దక్కుతుందని తెలిపాడు. ఐపీఎల్ సక్సెస్‌తో జియో సినిమా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా భారీగా పెరిగాయని అంబానీ పేర్కొన్నారు.