గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందేలు, గుండాటలు

గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందేలు, గుండాటలు
  • చేతులు మారుతోన్న లక్షలాది రూపాయలు
  • బౌన్సర్లతో బరులతో భద్రత
  • పందేంరాయుళ్ళకు నిర్వహకులు బుల్లెట్ బైక్ ఆఫర్లు
  • ఈ మూడు రోజులు పందేంరాయుళ్ళు ఫుల్ ఎంజాయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో  కోడిపందేలు , గుండాటలు, పేకాటలు జోరుగా సాగుతోన్నాయి. పోలీసులు ఎంత హెచ్చరించినప్పటికీ పందేలు కొనసాగడం గమనార్హం.  కృష్ణా, గోదావరి జిల్లాల్లోని సంక్రాంతి పండుగలో అంతర్భాగమైన కోడి పందేలు తరతరాలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో  భోగినాడు ఆదివారం ఉదయం నుంచి పందెంరాయుళ్ళు బరిలోకి దిగారు. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి , కృష్ణా  జిల్లాల్లో కోడి పందేలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఉండి, భీమవరం, నర్సాపురం, ఆకివీడు, నిడమర్రు, ఏలూరు జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, కోనసీమా జిల్లాలోని రాజోలు, మమ్మడివరం, గన్నవరం, రావులపాలెం తదితర చట్టుపక్కల గ్రామాల్లో జోరుగా కోడిపందేలు సాగుతోన్నాయి. కోడి పందేలను వీక్షించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యుల నుంచి రాజకీయ, సినీ , వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది బౌన్సర్లతో బరులకు భద్రత ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పందేలు జరుగుతోన్న ప్రాంతాల్లో లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయాయి.

పందేలను వీక్షించేందుకు వచ్చే అతిథుల కోసం బరులు నిర్వాహకలు భారీ ఏర్పాటు చేశారు. ఎల్ ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు, హైటెక్ హంగులతో కోడి పందాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు కోడి పందేలు, గుండాట, పేకాటలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ బరుల నిర్వహాకులు లెక్క చేయడం లేదు. గత రెండు రోజులుగా హైకోర్టు ఆదేశాల మేరకు చాల వరకు బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో 9400 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.  అయినప్పటికీ పందేంరాయుళ్ళు తగ్గడం లేదు. గోదావరి జిల్లాల్లో  పోలీసుల అనుమతి అధికారికంగా లేనప్పటికీ , అనధికారికంగా ప్రతి ఏట కోడిపందేలు జరగడం పరిపాటే. ఈసారి సంక్రాంతి పండగకు ఎన్నికల ఏడాది తోడు కావడంతో  కొన్ని ప్రాంతాల్లో పార్టీల వారీగా కూడా బరులను ఏర్పాటు చేశారు. బరులను ఏర్పాటు చేయడమే కాకుండా ఏ బరి ఎక్కడ ఉంది, అక్కడ ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయనే అంశాలతో కూడిన ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేయడం విశేషం. పందేలను చూసేందుకు వచ్చే వారి కోసం అన్ని రకాల మాంశాహారంతో  పాటు రకరకాల వినోదాలను బరుల వద్దే ఏర్పాటు చేశారు. ఆది, సోమ, మంగళవారం ఈ మూడు రోజుల్లో పందేంరాయళ్ళకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

పందేల బరిలో ఇరు వర్గాలు కొట్లాట

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో కొట్లాట  జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. పందేల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్టేషన్ కు చెందిన ఓ హోమ్ గార్డ్ మద్యం మత్తులో తోపులాటలకు దిగాడు. స్టాల్స్ ఏర్పాటు, లక్షల రూపాయలు చేతులు మారడం, బరిలో ఏకంగా మద్యం కౌంటర్ ఏర్పాటు చేసి యధేచ్ఛగా మద్యం అమ్మకాలు జరపడంతో వివాదం రేగిందని అక్కడే ఉన్న కొందరు చెబుతున్నారు.