నితీశ్​నివాసంలో.. నేడు విపక్షాల భేటీ!

నితీశ్​నివాసంలో.. నేడు విపక్షాల భేటీ!
  • కీలక సమావేశానికి కేసీఆర్​ దూరం
  • డైలమాలో బీఆర్ఎస్.. అందుకే నో ఇన్విటేషన్​
  • కాంగ్రెస్​తో కుదరదనుకున్న గులాబీ దళం
  • ఎంఐఎంను కూడా పక్కన పెట్టిన నితీశ్​
  • బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ అనే అనుమానాలు
  • ఇటీవల కేంద్రంపై దూకుడు తగ్గించిన కేసీఆర్​
  • విపక్షాలతో ఎక్కడా కలువకపోవడం కూడా కారణమే
  • పట్నా సమావేశంపై ఆసక్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీకి వ్యతిరేకంగా పట్నా వేదికగా విపక్షాలు శుక్రవారం సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ సందర్భంగా తొలుత నితీశ్‌ కుమార్‌ కీలక ప్రసంగం చేస్తారు. మోడీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైన, విపక్షాలు ఐక్యతపైనా ప్రధానంగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ మాట్లాడుతారు. సమావేశానికి రాహుల్ గాంధీ, టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, ఆప్​నుంచి కేజ్రీవాల్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్​వాదీ నుంచి అఖిలేశ్ యాదవ్, నేషనల్​కాన్ఫరెన్స్​నుంచి ఫరూఖ్​అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, డీఎంకే నుంచి స్టాలిన్ హాజరుకానున్నారు. కాగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటేందుకు పట్నాలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్​కు ఆహ్వానం అందలేదు. బీఆర్ఎస్, మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంను కూడా విపక్షాల కూటమి పక్కన పెట్టింది. దేశస్థాయిలో జరుగుతున్న ఈ సమావేశం ఇప్పుడు అసక్తిగా మారింది. పట్నాలోని నితీశ్ కుమార్ అధికారిక నివాసం ‘నెక్‌ సంవాద్‌ కక్షా’లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర 15 పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఈ భేటీలో విపక్షాల ఐక్యతకు కావాల్సిన ప్రాతిపదిక, తీరు గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. 

బీఆర్ఎస్​ను ఎందుకు పిలవలేదు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. కొంతకాలం నుంచి సైలెంట్ అయ్యారు. అటు బీఆర్ఎస్ విపక్షాల ప్రయత్నాల్లో పాలుపంచుకోవడం లేదు. అదీకాక బీజేపీని ఎదుర్కోనున్న మహావికాస్ అఘాడీ గల రాష్ట్రమైన మహారాష్ట్రలో కొత్తగా పార్టీని బలోపేతం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఏ రాష్ట్రంలోనైనా బలోపేతం చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉన్నాయని, కానీ, తాము బీఆర్ఎస్‌ను మాత్రం బీజేపీ బీ టీమ్ అనే కోణంలో చూస్తామని కుండబద్దలు కొట్టారు. ముందు నుంచే విపక్షాల ఐక్యత కూటమికి డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్న బీఆర్ఎస్ స్టాండ్‌పై నీలినీడలను కమ్ముకుంటున్నాయని చెప్పడం కొంత ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇదే సమయంలో శుక్రవారం నితీశ్​ ఆధ్వర్యంలో నిర్వహించే విపక్ష కూటమి భేటీకి బీఆర్ఎస్ కు ఆహ్వానం అందలేదు. అటు ఎంఐఎంను కూడా పక్కన పెట్టేశారు. బీఆర్ఎస్​ఆవిర్భావమే బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ కేసీఆర్​ చెప్పుకుంటూ వచ్చారు. నితీశ్, శరద్​పవార్, సోరేన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్​కేజ్రీవాల్, బిజు పట్నాయక్​, యూపీ, బిహార్ వంటి ప్రాంతాలకు వెళ్లడం, అక్కడి నేతలను హైదరాబాద్​కు రప్పించుకుని చర్చలు పెట్టారు. కానీ, ప్రస్తుతం నితీశ్, శరద్, స్టాలిన్, మమత వంటి నేతల నుంచి కేసీఆర్​కు సహకారం లేదు. మొన్నటి వరకు కేసీఆర్​తో స్నేహంగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఇప్పుడు విపక్షాల భేటీలో కీలకంగానే ఉన్నారు. కానీ, కేసీఆర్​కు ఆహ్వానం రాకపోవడంపై ఆయన కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. గతంలో నితీశ్​ కూడా కాంగ్రెస్​ లేని కూటమి సాధ్యం కాదంటూ బహిరంగంగానే చెప్పారు. అయితే, కాంగ్రెస్​వైపు కొంత అనుకూలంగా ఉన్నట్లు కేసీఆర్ వ్యవహరించినా.. ఇప్పుడు అదే పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. బీఆర్​ఎస్​పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. 

కాంగ్రెస్​లోనే డైలమా!

అయితే, కాంగ్రెస్‌లో మాత్రం డైలామా వీడటం లేదు. విపక్షాల ఐక్యత కోసం ప్రాంతీయ పార్టీలు నేరుగా బీజేపీపై పోరాడటానికి కాంగ్రెస్ మొత్తంగా తప్పుకోవాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను జీర్ణించుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్, యూపీలో ఎస్పీకి అన్ని సీట్లను కాంగ్రెస్ త్యాగం చేస్తే.. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పార్టీలు మద్దతు తెలుపనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని ఇప్పటికే సూచించాయి. ఈ నిర్ణయం తొందరగా తీసుకుంటే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలపడానికి తాము సహకరిస్తామని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాన్ని నితీశ్ ముందు పెడుతున్నాయి. కానీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణల్లో విజయం ఖాయం అనే ధీమాతో కాంగ్రెస్ దీనిపై ఓ కమిట్‌మెంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. కర్ణాటకలో మంచి విజయం సాధించిన కాంగ్రెస్..​ఈ ఏడాది జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆధిపత్యం చూపిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఇదే సమయంలో ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్ పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్‌లో పోటీ చేయబోమని ఆప్ స్పష్టం చేసింది. అదే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్.. సీపీఎంతో దోస్తీ కడితే లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఆశించరాదని మమతా బెనర్జీ విస్పష్టంగా చెప్పేశారు. కాగా, తామేమీ రాజకీయాల నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నేడు పట్నా సమావేశంలో ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలను (ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు) వదిలిపెట్టాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదించేందుకు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌తో ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను సైతం విశ్లేషిస్తున్నారు. హస్తానికి మైనార్టీల్లో ముఖ్యంగా ముస్లింలో విశ్వాసం గణనీయంగా పెరిగిందని, ప్రాంతీయ పార్టీలు తమ కంచుకోటల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడాన్ని నిరాకరిస్తూనే ముస్లిం ఓట్లు తమకు దక్కాలని ఆశిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.


బీజేపీ భయపడుతున్నది

పాట్నాలో విపక్షాలు నిర్వహిస్తున్న సభ, సమావేశంతో బీజేపీ భయపడుతోందని బిహార్ ఆర్థికశాఖ మంత్రి విజయ్​కుమార్ అన్నారు. విపక్షాలన్నీ ఏకం కావడం కలగా బీజేపీ భావించిందని, విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైందన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నను బీజేపీ మాటిమాటికి ప్రచారం చేస్తూ పార్టీల్లో పొరపొచ్చాలు వచ్చేలా చేసిందని, కానీ ఇప్పుడు బీజేపీ ఆటలు ఇక సాగనీయమన్నారు. తాము రూపొందించిన ఈ ఏజెండాతో బీజేపీని 2024లో మట్టికరిపిస్తామని, అన్ని పార్టీలు పదవులకతీతంగా ఒకే ఎజెండాపై పనిచేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. పీఎం అభ్యర్థి ఎవరన్న అంశాన్ని ఈ సభలో చర్చించమన్నారు. నరేంద్రమోడీ కంటే మంచి వ్యక్తినే పీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటామన్న విశ్వాసం తమకుందన్నారు. పట్నా సభకు వచ్చే నేతలందరి అభిప్రాయాలను ఇప్పటికే స్పష్టంగా తీసుకున్నామని, వీరంతా బీజేపీని ఓడించాలన్న సంకల్పంతోనే ఈ సభలో పాల్గొంటున్నారని విజయ్​ కుమార్​స్పష్టం చేశారు.