నాపై జరిగిన దాడి.. ప్రపంచంలో ఏనేతపై జరిగుండదు

 నాపై జరిగిన దాడి.. ప్రపంచంలో ఏనేతపై జరిగుండదు
  • తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి
  • అమరులను నిత్యం స్మరించుకునేందుకు నిర్మాణం
  • రాష్ట్ర సాధన కోసం పిడికెడు మందితో మేథోమథనం చేశాం
  • అన్నివర్గాల సహకారంతో ఉద్యమాన్ని నడిపాం
  • అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరణలో సీఎం కేసీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘తెలంగాణ కోసం వందల మంది వీరులు అమరులయ్యారు. ఉద్యమం కాలంలో అనేక కేసులు పెట్టారు. రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిసింది. తెలంగాణ కోసం నేను ఉద్యమం చేస్తుంటే.. సమైక్యాంధ్ర తొత్తులు నాపై రాజకీయ దాడి చేశారు. ప్రపంచంలో ఏ నాయకుడిపైనా  ఇలాంటి దాడి జరగలేదు. అయినా ఏనాడూ  బాధ ప‌డకుండా ఉద్యమ కార్యాచరణ కోసం తాము పిడికెడు మందిమి కలిసి ఐదారు గంటలపాటు చర్చలు చేశాం. 1966లో ఖమ్మం నుంచి ఆజన్మ తెలంగాణ వాది అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్​అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకార్థం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ఒడ్డున రూ.178 కోట్ల వ్యయంతో 150 అడుగుల ఎత్తుతో నిర్మించిన స్మారక స్తూపాన్ని గురువారం కేసీఆర్ ఆవిష్కరించారు. మొద‌ట‌ పోలీసులు అమరవీరులకు తుపాకులతో సెల్యూట్ చేశారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఇత‌ర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. తర్వాత అమ‌ర‌వీరుల‌పై ప్రద‌ర్శించిన లఘుచిత్రాన్ని మినీ ఆడిటోరియంలో తిలకించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. 

చిరస్థాయిగా ఉండాలనే లక్ష్యంతో..

తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరవీరుల స్మారకాన్ని నిర్మించిందని  సీఎం కేసీఆర్​అన్నారు. అమ‌రుల‌ను నిత్యం స్మరించుకునేందుకే అమ‌ర జ్యోతిని నిర్మించామని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. వారి ప్రాణత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందన్నారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి, దశాబ్ది ఉత్సవాలు ముగించాలని అనుకున్నామని, అయితే సంతోషం, దుఃఖం ఒకేసారి కనిపిస్తున్నాయన్నారు. అనేక అపవాదులు, హింస, పోలీసుల కాల్పులు ఎన్నో తెలంగాణ చరిత్రలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు జలదృశ్యం సమీపంలో ఉంటే అప్పటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి సామాన్లు బయట పెట్టించి వెళ్లగొట్టిందని గుర్తు చేశారు. అందుకే పట్టుబట్టి, అదే ప్రదేశంలో అమరవీరుల స్తూపం నిర్మించాలని సంకల్పించామన్నారు. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో వీ ప్రకాశ్, మ‌ధుసూద‌నాచారి లాంటి పిడికెడు మందితో మేధోమ‌ద‌నం చేశామన్నారు. తర్వాత రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో ఒక వ్యూహంతో బయలుదేరామని, ఆ సంద‌ర్భంలోనే ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌ను క‌లిశామన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని సీఎం గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట‌లో ఉద్యోగ గ‌ర్జన చేసిన‌ప్పుడు.. నాటి రోశ‌య్య ప్రభుత్వం హైద‌రాబాద్ ఫ్రీ జోన్ అని 14 ఎఫ్ తీసుకొస్తే నిర‌స‌న వ్యక్తం చేశామన్నారు. అప్పుడే ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు కూర్చుంటాన‌ని ప్రక‌ట‌న చేస్తే.. నిమ్స్ డాక్టర్లు కూడా బెదిరించారన్నారు. నిరాహార దీక్ష చేసే శ‌క్తి లేదని, కోమాలోకి వెళ్తే మ‌ళ్లీ బ‌య‌ట‌కు రావన్నారన్నారు. అయినా త‌ట్టుకోని నిల‌బ‌డ్డానని అన్నారు. విద్యార్థులు, నాయ‌కుల  నిర‌స‌న‌లతో ఢిల్లీ స‌ర్కార్ దిగివ‌చ్చిందన్నారు. 

ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు

ముద్ర, తెలంగాణ బ్యూరో : గతంలో ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనేవాళ్లని, కానీ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా మారిందన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, వైద్యారోగ్య రంగంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ తప్ప వేరే హాస్పటల్ లేకుండేవన్నారు. ప్రస్తుతం అద్భుతమైన 5 కార్పోరేట్ స్థాయి హాస్పటల్స్ త్వరలో రాబోతున్నాయన్నారు. ప్రభుత్వ రంగంలో గతంలో17 వేల బెడ్లు ఉంటే, ప్రస్తుతం 50 వేల బెడ్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆరోగ్యమంత్రిగా హరీశ్​రావు వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే ఖచ్చితంగా హయత్ నగర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ ను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని కేసీఆర్ ప్రారంభించారు. రూ.1,489.29 కోట్ల వ్యయంతో సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట 15,660 ఇండ్లను నిర్మించారు.