మహిళలకు ప్రమాదకరంగా మారిన మోదీ రామరాజ్య పాలన ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

మహిళలకు ప్రమాదకరంగా మారిన మోదీ రామరాజ్య పాలన ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ముద్ర: ప్రధాని నరేంద్ర మోదీ రామరాజ్య పాలన మహిళలకు ప్రమాదకరంగా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. బీజేపీ పాలిత మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఇందుకు సజీవ సాక్ష్యం అన్నారు. హైదరాబాద్ దోమలగూడ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఊరేగించిన పాశవిక ఘటన, రావణకాష్టంలా రగులుతున్న హింసాకాండకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు బాధ్యత వహించాలన్నారు. వెంటనే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేసారు.

ఈ అవమానకర ఘటనపై బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి 'మీరు చర్యలు తీసుకోకుంటే, మేం స్పందించాల్సి వస్తుందని' సుప్రీం కోర్ట్ తీవ్రంగా హెచ్చరించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. బీజేపీ డబల్ ఇంజిన్ సర్కార్ లు రామ రాజ్య పాలన పేరుతో కౌరవ రాజ్య పాలన కొనసాగిస్తూ విభజన, విద్వేష రాజకీయాలను, ప్రతీకార దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అత్యాచారాలు, హత్యలతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ బిజెపిచే పాలించబడుతున్న రాష్ట్రంపై ప్రధానమంత్రి మోదీ 79 రోజులు మౌనం వహించి, ఇప్పుడు ఘటన తరువాత స్పందించి మొసలి కన్నీరు.

కార్చడం దుర్మార్గమన్నారు. బీజేపీ ప్రభుత్వాల పాలనలో మహిళలకు భద్రత కరువైందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో మహిళలపై హేయమైన చెర్యలు అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని, మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. అత్యాచారానికి గురైన బాధితులకు వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో అప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు శోభన్ భూక్యా, సోలొమన్ రాజ్, నేతలు టి. రాకేష్ సింగ్, అప్స బేగం, రుద్రాక్ష మల్లేష్, ఆప్ యూత్ వింగ్ అధ్యక్షులు సర్దార్ రణధీర్ సింగ్ రానా తదితరులు పాల్గొన్నారు.