ఊర్లల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు

ఊర్లల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు
  • తీర్పులు, తీర్మానాలతో ఆధిపత్యం  
  • ప్రశ్నించే వారిపై బహిష్కరణ వేటు.. 
  • బెల్ట్‌షాపులు, ఇసుక క్వారీలకు వేలంపాటలు. 
  • ఆదాయం సమకూర్చడమే టార్గెట్‌.
  • మిన్నకుండిపోతున్న అధికారులు..


మెట్‌పల్లి ముద్ర:- మెట్‌పల్లి డివిజన్ లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కొంతకాలం నుంచి గ్రామాభివృద్ధి కమిటీలు పెద్దరికం పేరిట అక్రమ వ్యాపారాలను ప్రోత్సాహిస్తూ తమ తీర్పులు, తీర్మానాలను దిక్కరించే వారికి బహిష్కరణల వేటు వేస్తున్నాయి. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఈ వీడీసీల్లో సభ్యులుగా ఉంటారు. గ్రామ అభివృద్ధి పేరిట ఏర్పడ్డ వీడీసీలు తమ అసలు లక్ష్యాన్ని విస్మరించి తీర్పులు, తీర్మాణాలతో పాటు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. ఓ రకంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సైతం పక్కన పెట్టి పల్లెల్లో సమాంతర పాలన సాగిస్తున్నాయని పలువురు అంటున్నారు. గ్రామ ఐక్యత, అభివృద్ధే ఏజెండా ముసుగులో పల్లెల్లో ఏర్పాటవుతున్న వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు అడ్డుచెప్పే వారిని మానసిక, సామాజిక, ఆర్థికంగా వేధింపులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

ప్రజాప్రతినిధులంతా డమ్మీలు..

వీడీసీలు గ్రామాల్లో అన్ని తామై వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులను సైతం శాసించే స్థాయికి చేరుకున్నాయంటున్నారు.వీడీసీల ముందు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బలాదూర్‌ అయ్యారంటున్నారు. వీరు ఇచ్చే తీర్పులకు సర్పంచ్‌లు అడ్డు చెప్పే పరిస్థితి లేదన్న వాదనలున్నాయి. అవసరమైతే సర్పంచ్‌లకు,ఎంపీటీసీలకు సైతం వీడీసీలు పక్కన పెట్టే వాతావరణాన్ని గ్రామాల్లో కల్పిస్తున్నారంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా అన్ని పార్టీలు వీడీసీల కటాక్షం కోసం క్యూ కడుతుంటాయి. 

ఆదాయ వనరులపైనే గురి..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపుల ఏర్పాటుకు వీడీసీల పరోక్ష మద్దతే కారణమంటున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసేందుకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నాయి. ఎక్కువ మొత్తానికి పాటపాడిన వ్యక్తి బెల్ట్‌ షాపును దక్కించుకుంటాడు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీ పంచాయతీ బెల్ట్‌ షాపులకు లక్షలాది రూపాయల్లో వేలంపాట కొనసాగుతోంది. బెల్ట్‌ షాపులకు వీడీసీలు లైసెన్సు తరహా అనుమతులను సైతం జారీ చేస్తున్నాయంటున్నారు. వీటి అనుమతితో గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వాగులు, చెరువులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇసుక క్వారీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి వేలంపాట నిర్వహించి లక్షలాది రూపాయలు సేకరిస్తున్నాయంటున్నారు. కొన్ని గ్రామాల్లో కూల్‌ డ్రింక్‌ షాపులు, చికెన్‌ సెంటర్‌లకు కూడా వేలంపాట నిర్వహించి నిధుల సేకరణ కొనసాగిస్తున్నాయన్న విమర్శలున్నాయి.

బహిష్కరణ వేటు.

పదిహేను రోజుల్లో మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ గ్రామంలో చెలరేగిన చిన్నపాటి వివాదంలో వీడీసీ మూడు కుటుంబాలను బహిష్కరించింది. రెండు రోజుల క్రితం మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మనగర్ గ్రామాలకు చెందిన కొంతమంది గౌడ కులస్తులను ఓ భూవివాదంలో వీడీసీ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన బాధితులతో గ్రామంలోని ఎవరూ మాట్లాడకపోవడం.. బట్టలు ఉతికేవారు రాకపోవడం... వ్యవసాయ పనులకు కూలీలు వెళ్లక పోవడం.. కిరాణాల్లో నిత్యావసర సరుకులు ఇవ్వక పోవడం.. కనీసం హోటళ్లలో చాయ్, టిఫిన్లు ఇవ్వకపోవడం వంటి కఠిన ఆంక్షలు గ్రామీణ సమాజం లో బాధితుల స్థాయిని దిగజార్చి, మానసిక స్థైర్యానికి దెబ్బకొడుతున్నాయి. ఒకవేళ బాధితులు తప్పు చేసి ఉంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఫిర్యాదు చేసేందుకు అనేక మార్గాలు ఉన్న ఈ కాలంలో బహిష్కరణలు పరిష్కారం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి...

మిన్నకుండిపోతున్న అధికారులు..

గ్రామాల్లో వీడీసీలు అనధికారికంగా పెత్తనం చెలాయిస్తూ బహిష్కరణలు విధిస్తూ, అమాయకుల వద్ద లక్షల్లో జరిమానాలు విధిస్తూ. మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ. అక్రమ వ్యాపారాలకు వత్తాసు పలుకుతున్న. వీడీసీ ల ఏర్పాటు చట్ట విరుద్ధం అని తెలిసిన వీడీసీల నుండి వస్తున్న మామూళ్లకు అలవాటు పడిన ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.