రైతుబంధు ఇప్పిస్తానని నానమ్మను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న మనుమడు...

రైతుబంధు ఇప్పిస్తానని నానమ్మను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న మనుమడు...

మోసపు రిజిస్ట్రేషన్ పై    మనుమడిపై ఆర్డీవో కు పిర్యాదు..

 రిజిస్ట్రేషన్ బ్లాక్  చేసి,  తహశీల్దార్ పై  విచారణకు ఆదేశించిన  ఆర్డీవో మాధురి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : వృద్ధులైన తల్లిదండ్రులను కొందరు కన్న కొడుకుల మోసం చేస్తుంటే ... వారి కొడుకులు ( మనుమలు)  సైతం మోసగిస్తూ వృద్ధుల పేరిట ఉన్న ఆస్తులను మోసం తో రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందుకు ఒక ఉదరణనే ఈ సంఘటన. కొడిమ్యాల మండలం రామ్ సాగర్  గ్రామానికి చెందిన  నీలగిరి అమ్మాయి(86) అనే వృద్ధురాలు తన మనుమడు నీలగిరి రామేశ్వర్  రావు రైతు బంధు ఇప్పిస్తానని  తన  పేరిట గల పట్టా భూమిని మోసగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆలస్యంగా గుర్తించిన వృదురాలు ఆ  భూమిని తిరిగి తన పేరిట పట్టా చేయించాలని,మోసగించిన మనుమడిపై, ఎలాంటి విచారణ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసిన కొడిమ్యాల తహశీల్దార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీవో మాధురి కి ఫిర్యాదు చేసింది.


వృద్ధురాలు  చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కొడిమ్యాల మండలం రామ్ సాగర్ గ్రామానికి చెందిన నీలగిరి అమ్మాయి  అనే 86 సంవత్సరాల వృద్ధురాలి భర్త 4 ఏళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారులుండగా వారిలో చిన్న కొడుకు గతం లోనే  పాముకాటు ప్రమాదంలో మరణించగా, ఉన్న పెద్ద కొడుకు ఆమెను పోషించక పోవడం తో ఆ వృద్ధురాలు పలు ఇబ్బందులు పడుతూ జీవిస్తున్న పరిస్థితులో నీకు రైతు బంధు కోసం తహశీల్దార్ అఫిసు లో సంతకం పెట్టాలని ఆమె మనుమడైన నీలగిరి రామేశ్వర్ రావు మోసగించి  తనకు నానమ్మ తన పట్టా భూమి 2 ఎకరాలు అమ్మిందని తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ,ఆ సమయంలో తనను తహశీల్దార్ నీవు భూమి అమ్మినావా,డబ్బులు ముట్టాయా అని అడుగలేదని,అడిగి ఉంటే ఆ మోసం తెలిసేదని ఆ వృద్ధురాలు రోదిస్తూ తెలిపింది.  స్పందించిన ఆర్డీవో ఆ భూమి రిజిస్ట్రేషన్ ను బ్లాక్ చేయాలని, అంతే కాక మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న మనుమడిపై పోలీసు కేసు పెట్టాలని  తహశీల్దార్ ను ఆర్డీవో ఆదేశించింది. ఎలాంటి విచారణ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ పై శాఖపర చర్యలు తీసుకుంటామని  ఆర్డీవో తెలిపారు. ఈ సందర్భంగా  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధులకు చట్టపరమైన రక్షణలున్నప్పటికీ కుమారులు,కూతుర్లు,మనుమలు,వారసులు నిరాదరిస్తు,మోసం తో నమ్మించి వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం,వంతుల పోషణ పేరుతో యమ పాషాలుగా మారుతున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో వృద్ధుడు తనకు తానే చితి పేర్చుకొని సజీవ దహనం, కామారెడ్డిలో తల్లి శవాన్ని హాస్పిటల్ నుంచి తీసుకు పోని కర్కశ కూతుర్ల    సంఘటనలు  హృదయ విధారకమన్నారు. నిరాదరిస్తున్న వారికి 3 నెలల జైలు శిక్ష చాలదని, దీన్ని ఒక సంవత్సరం పెంచాలని, వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో ఇంకా పలు ప్రయోజన సవరణలు తమ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు సూచించినట్లుగా  కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఏండ్లు గడుస్తున్నా అమలు చేయక పోవడం పై  ఆవేదన వ్యక్తం చేశారు.