ప్రధాని మోడీతో  జై శంకర్ భేటీ!

ప్రధాని మోడీతో  జై శంకర్ భేటీ!
  • కెనడాలో పరిస్థితులను వివరించిన విదేశాంగ మంత్రి
  • భారత పౌరులు, స్టూడెంట్లు జాగ్రత్తగా ఉండాలన్న మోడీ
  • కెనడాలోని ఇండియన్ల కోసం మదద్​వెబ్​సైట్​ప్రారంభం


న్యూఢిల్లీ : కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యపై భారత్ కు, కెనడాకు మధ్య దౌత్యపరమైన వివాదం రాజుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రధానితో సమావేశమైన జైశంకర్.. వివాదం గురించి ఆయనకు వివరించారు.  దీంతోపాటు, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, కెనడాలో భారతీయుల పరిస్థితిపై కూడా జైంశకర్ ప్రధానికి నివేదించినట్లు సమాచారం. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత్​తీవ్రంగా ఖండించింది.

జూన్‌ 18న హర్​దీప్​సింగ్ పై కాల్పులు..

జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు. భారత్, కెనడా మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. 

కెనడాలో జాగ్రత్తగా ఉండండి : ఇండియా

కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులను హెచ్చరించింది. ఆ దేశంలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులు భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే కెనడాలో భారతీయులకు సాయం కోసం మదద్ పేరుతో ఓ వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. madad.gov.in  పేరుతో రూపొందించిన ఈ వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ భారత పౌరులు, విద్యార్థులకు సూచిస్తోంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్ధితులు ఏర్పడినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఇండియా కోరింది.