కేసీఆర్ వారంటీ పీరియడ్  అయిపోయింది

కేసీఆర్ వారంటీ పీరియడ్  అయిపోయింది

తొమ్మిదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు
తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దే
పురుమల్లలో హస్తం పార్టీ గెలుపు ఖాయం
కేంద్ర మాజీ మంత్రి జై రామ్ రమేశ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కేసీఆర్ వారంటీ పీరియడ్ అయిపోయిందని, తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో మహిళలు, మైనార్టీ, రైతులకు చేసిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జై రామ్ రమేశ్ అన్నారు. కరీంనగర్ లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని విమర్శించారు.  అభివృద్ధి అవుటర్ రింగ్ రోడ్డు దాటలేదని ఎద్దెవా చేశారు. కరీంనగర్ ను లండన్ చేస్తాన్న కేసీఆర్ మాట మర్చిపోయాడని అన్నారు. దేశంలో నిరుద్యోగులున్న రాష్ట్రల్లో తెలంగాణ నంబర్1లో ఉందని తెలిపారు.

తెలంగాణలో సామాజిక న్యాయం కానరాకుండ ఉందన్నారు. కుటంబ పాలనపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు కేవలం ఈ నాలుగు కుటుంబ సభ్యుల మధ్య తెలంగాణ పాలన కొనసాగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్  రెండు ఒక్కటే అని స్పష్టం చేశారు.  కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ నాయకుడు రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్,  పీసీసీ అధికార ప్రతినిధి అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.