KCR - ఈసీ ప్రచార నిషేధంపై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్.. సంచలన కామెంట్స్

KCR - ఈసీ ప్రచార నిషేధంపై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్.. సంచలన కామెంట్స్

ముద్ర,తెలంగాణ:- తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై ఎలక్షన్ కమిషన్ నిషేధ ఆంక్షలు విధించిందన్న కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు. మరి ఆయనపై ఎలాంటి నిషేధం విధించలేదు అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ లో రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు.

”ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాపై నిషేధం విధించింది. 48 గంటలు ప్రచారం చేయొద్దరి, ప్రచారంలో పాల్గొనవద్దని నామీద బ్యాన్ విధించింది. మీ అందరిని నేను ఒక్కటే కోరుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి.. నీ పేగులు మెడలో వేసుకుంటా, నీ గుడ్లు పీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ, నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెబుతున్నా.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని నేను మనవి చేస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.