నారీ శకం

నారీ శకం
  • 2029 నుంచి మొదలు
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • అనుకూలంగా 454, వ్యతిరేకంగా 2 ఓట్లు
  • మహిళా శక్తికి ద్వారాలు తెరుచుకున్నాయన్న ప్రధాని మోడీ
  • ఇది మహిళా సాధికారిత అంశమన్న అమిత్ షా
  • ఓటింగ్‌కు ముందే సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
  • బిల్లుకు మద్దతు ఇస్తాం, ఓబీసీలకు కోటా ఇవ్వాలి
  • ఈ బిల్లు భారత మాజీ ప్రధాని రాజీవ్ కల
  • సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ
  • బిల్లు సమగ్రంగా లేదన్న రాహుల్ గాంధీ
  • ఇదంతా కేవలం ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శ 


పార్లమెంటులో చేసే ప్రతి చట్టం భారతీయులలో స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. భారతీయుల కలలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టాలి. బిల్లును ప్రవేశపెట్టిన సెప్టెంబర్‌19 చరిత్రాత్మక దినం. ఈ చరిత్రాత్మక రోజుననే మనం మహిళా శక్తికి ద్వారాలు తెరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి మరింత సాధికారత కల్పిస్తుంది. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశాభివృద్ధిలో మహిళలకు క్రమంగా మరింత భాగస్వామ్యం కల్పించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. సభ ఈ బిల్లును ఆమోదించడం శుభ పరిణామం. ఇక నుంచి సరికొత్త నారీ శకం ఆరంభమవుతుంది. –నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి  


( ముద్ర నేషనల్ డెస్క్):-చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. దీని మీద జరిగిన చర్చలో 60 మంది  ఎంపీలు మాట్లాడారు. దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చ జరిగింది. ఆ తరువాత జరిగిన ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు వచ్చాయని  స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు అసంపూర్తిగా ఉందని అంతకుముందు విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. స్లిప్పులు పంపిణీ చేసిన తర్వాత, తిరిగి తీసుకొనే వరకూ ఎవరూ తమ సీట్లు వదిలి వెళ్లవద్దని సూచించారు. బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలలో అమలు కాదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల అనంతరం 2029 ఎన్నికలలోనే ఇది అమలవుతుందన్నారు. 2024 ఎన్నికల తరువాత జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. 

మహిళా సాధికారతకు దారి 

కొన్ని పార్టీలకు మహిళా రిజర్వేజన్ బిల్లు  రాజకీయ అంశం కావచ్చేమో కానీ, బీజేపీకి ఎంతమాత్రం కాదని అమిత్ షా స్పష్టం చేశారు. తమ పార్టీకి, తమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ బిల్లు మహిళా సాధికారతకు చెందిన అంశమని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమని, మహిళా ప్రగతికి సంబంధించిన విజన్‌ను ప్రధాని మోడీ జీ-20లో ఆవిష్కరించారని చెప్పారు. యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తమ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, భారత పార్లమెంటరీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు ఇదని అన్నారు. ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మహిళా భద్రత, గౌరవం, సమప్రాధాన్యం అనేవి ప్రభుత్వానికి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, విధానాల రూపకల్పనలో మహిళలకు భాగస్వామ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తుందని చెప్పారు.

మాటల యుద్ధం

అంతకుముందు, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంటులో మాటల యుద్ధం జరిగింది. మహిళా ఎంపీల ప్రసంగాలతో సభ దద్దరిల్లిపోయింది. ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ చర్చ మొదలు పెట్టారు. మోడీ ప్రభుత్వంవై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రెజ్లర్లు అన్ని నెలల పాటు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఎన్నికల గిమ్మిక్కు అంటూ మండి పడ్డారు. ఈ బిల్లుకి సంపూర్ణ మద్దతునిస్తామని వెల్లడించిన సోనియా గాంధీ, ఓబీసీ వర్గానికి చెందిన మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని కోరారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలోనూ పోటీ పడుతున్నారని అన్నారు. దేశ స్వాతంత్య్రోద్యమం నుంచి మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 2010లోనే తాము రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. అప్పట్లో కొందరు దీనిని అడ్డుకున్నారని, అందుకే, అమలులోకి తీసుకురాలేకపోయామని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయినప్పటికీ లోక్‌సభలో పాస్ కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ అడ్డుకోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. 2029 వరకూ మహిళలకు ఈ బిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని తేల్చి చెప్పారు సోనియా గాంధీ. ఇది అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎన్నాళ్లు వేచి చూడాలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
   
బిల్లు అసంపూర్తిగా ఉంది: రాహుల్​ 

ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందన్నారు. బీజేపీ అందరినీ తప్పుదారి పట్టిస్తోందని, ఈ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్లను ప్రస్తావించలేదని ప్రస్తావించారు. కులగణన చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఓబీసీ వర్గాల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని, ఇప్పుడున్న వ్యవస్థలలో ఓబీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతుంటే రాష్ట్రపతిని ఆహ్వానించలేదని దుయ్యబట్టారు. మహిళలకు నమస్కరించాలని, పూజించాలని చెప్పడం ఆపేయాలని, వాళ్లకు సమానత్వం ఇవ్వడం కన్నా గౌరవం ఇంకేమీ ఉండదని డీఎమ్‌కే ఎంపీ కనిమొళి అన్నారు. తమను తల్లిగా, చెల్లిగా, భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని, మగాళ్లతో సమానంగా చూస్తే చాలని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ బిల్ తీసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న స్టంట్ అని మండి పడ్డారు. ఈ బిల్‌ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘మహిళలు ఇంట్లో వంట చేసుకుంటే ఇంకెవరో వచ్చి దేశాన్ని నడిపిస్తారు’ అనే భావజాలంతో బీజేపీ పని చేస్తోందని ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. త‌న‌ను ఉద్దేశించి మ‌హారాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ ఒక‌రు వివ‌క్షాపూరిత వ్యాఖ్యలు  చేశార‌ని గుర్తుచేశారు. ‘ఇంటికెళ్లి వంట చేసుకో, మేమంతా దేశాన్ని న‌డుపుతాం’ అని వ్యాఖ్యానించార‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌ను ఎద‌గ‌నీయ‌ని వారి ప‌క్షాన విప‌క్ష ఇండియా కూట‌మి నిలుస్తోంద‌ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యల‌ను తిప్పికొట్టారు. 
 
స్మృతి ఇరానీ కౌంటర్‌

అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగానే స్పందించారు. సోనియాగాంధీ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. 2010లో బిల్ తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం ‘ఇది మా బిల్’ అని చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్‌పై ఎన్నో వాదోపవాదాలు జరిగాయి.  

మరో15 యేళ్ల తర్వాతే అమలు: మాయావతి 

బిల్లు అమలు విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని ఆమె ఆరోపించారు. ఈ బిల్లు ప్రకారం, రాబోయే 15–-16 ఏళ్లలో మహిళలకు రిజర్వేషన్ అందదని అన్నారు. ‘బిల్లుకు మా మద్దతుంటుంది’ అని మాయావతి ప్రకటించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేర్వేరుగా కోటా కల్పించాలని కోరారు. ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  అన్నారు. ‘వాళ్లకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసే ఉద్దేశం లేదు. ఉంటే గతంలోనే ఆ పని చేసేవారు' అని నితీశ్ అన్నారు.