అదానీతో  పీఎం దూరంగా ఉంటున్నారా?

అదానీతో  పీఎం దూరంగా ఉంటున్నారా?

ప్రపంచం అంతా బద్నామ్ అయిపోయిన గౌతమ్ అదానీతో  మన పీఎం నరేంద్ర మోడీ దూరాన్ని పాటిస్తున్నారా? ఉత్తరప్రదేశ్ లో జరిగిన అతిపెద్ద ప్రపంచ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో గౌతమ్ అదానీ కనిపించలేదు. పీఎం నరేంద్ర మోడీ ఒక్కరే వచ్చారు. దేశవిదేశాలలో ఎప్పుడూ ప్రధాని వెంట  కనిపించే అదానీ యూపీలో కనిపించలేదు. ముకేష్ అంబానీ, కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా, ఇలా ఎందరో ప్రముఖ కార్పొరేట్ లు కనిపించారు. కానీ, మొదటిసారి ఇలాంటి సమ్మిట్ లో అదానీ కనిపించక పోవడం ఆశ్చర్యమే కదా! అదానీకి ఆహ్వానం ఉన్నా  రాలేదు. బహుశా పార్లమెంట్ లో విపక్షాలు పీఎం మోడీ – అదానీ అంటూ నినాదాలు చేసారని, తమ దోస్తానా మీద జరుగుతున్న ప్రచారం ప్రభావం కావచ్చు, రైతులు తమ ఆందోళన సందర్భంగా కూడా ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ మీద భారీ విమర్శలు చేసారు. పీఎం నరేంద్ర మోడీకీ వారికీ మధ్య ఉన్న దోస్తానాను పేర్కొంటూ రైతు సంఘాల నేతలు ప్రకటనలు ఇచ్చారు. దేశమంతా చూసింది. అయితే, యూపీలో 1 లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు  పెడుతానని గతంలో అదానీ ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు దాని సంగతి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. తన కంపెనీల ఫేక్ వ్యవహారం హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో బయట పడిన నేపథ్యంలో విదేశీ బ్యాంకులు, సంస్థలు అదానీ కంపెనీల మీద విచారణలు, సమీక్షలు చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు షేర్ లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతా వేగవంతంగా సాగుతున్నది. ఇన్వెస్టర్లు పది లక్షల కోట్లకు పైగా మునిగారనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ సంకటం నుంచి అదానీ బయట పడే పరిస్థితి కనిపించడం లేదు. 

అసలు సమస్య అదే
మన దేశంలో ఇన్వెస్టర్స్ పరేషాన్ లో ఉన్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నెల 13న సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. నిపుణుల కమిటీ వేయడానికి సిద్ధమని ప్రభుత్వం చెప్పింది. కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ లో ఇస్తామని విన్నవించింది. ఈ నెల 15లోగా ఈ పేర్లతో కూడిన కవర్ ప్రభుత్వం కోర్టుకు అందిస్తుంది. 17 వరకు సమయం ఉంది. ఇంకా జేపీసీ కోసం విపక్షాల డిమాండ్ కొనసాగుతూనే ఉన్నది. ఇటు అదానీ వ్యవహారంతో  ఇండియన్ మార్కెట్ కు ఇబ్బంది లేదని సెబీ పేర్కొంది. దేశంలో ఎకానమీ,- రాజకీయం కలిసి పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో? అదానీ వ్యవహారం చూస్తే స్పష్టం అవుతున్నది. షేర్ బజార్ లో అదానీ బద్నాం అయిపోయారు. ఇంత జరుగుతున్నా పీఎం నరేంద్ర మోడీ నోరు మెదుపరు. పైగా తాను ఒక్కడిని ఇంత మందికి భారం అవుతున్నానని అంటారు. దేశం కోసం తాను ఎంతో చేస్తున్నా తనని ఏది బడితే అది అంటున్నారని విక్టిమ్ కార్డు ఉపయోగించారు. జి–-20కి భారత్ నాయకత్వం వహించడం కొందరికి నచ్చడం లేదంటారు. గతంలో జి–-20 కి ఇండోనేషియా నాయకత్వం వహించింది. ఇండోనేషియా ఏమైనా విశ్వగురు అయిపోయిందా? ఐదు ట్రిలియన్  ఎకానమీ, అమృత్ కాలం లాంటి మాటలు కోటలు దాటుతున్నవి. 2047 ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. చీటికిమాటికీ 80 కోట్ల మంది పేదలకు ఐదు కిలోల రేషన్ గురించి చెబుతారు. వారి స్థితిగతులు ఎప్పుడు మారుతాయో? అలా, ఇలా ఇంకెంత కాలం? అనే ప్రశ్నకు సమాధానం లేదు? నరేంద్రమోడీ పాలనకు సంబంధించి బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలలో ఐటీ అధికారులు సోమవారం సోదాలకు దిగారు. ఇది దేనికి సంకేతం? సోదాలకు సహకరిస్తున్నామని బీబీసీ అధికారులు కూడా వెల్లడించారు. 

అప్పుడు పొగిడి ఇప్పుడు తెగిడి
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు 2జీ స్కాం, కామన్ వెల్త్ లాంటి స్కాంల మీద ఆందోళనల పర్వం చూసాము. అప్పుడు 2జీ మీద ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదానీ విషయంలో జేపీసీ ఏర్పాటు చేయాలనే విపక్షాల డిమాండ్ ను పీఎం నరేంద్ర మోడీ ఎందుకు అంగీకరించడం లేదు?  కనీసం తన మీద, అదానీతో దోస్తానా మీద  ఏదో అటు, ఇటు తిప్పుతూ, దేశం కోసం ఎంతో చేస్తున్నా తనని కొందరు విమర్శిస్తున్నారని, బాధితునిలా, సానుభూతి పొందేవారిలా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో దేశం ఎలా దెబ్బ తిన్నదో హార్వార్డ్ నివేదిక చెప్పిందనే ఆ విషయాన్ని ప్రస్తావించిన పీఎం మోడీ, 2016 లో పెద్ద నోట్ల రద్దు, దేశంలో పరిణామాలను పేర్కొంటూ వచ్చిన హార్వార్డ్ పుస్తకం మీద, ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థల అధ్యయనాలు, విమర్శల మీద ఎందుకు మాట్లాడరు?  2016 లో హార్వార్డ్ వి వట్టి కాగితాలు అన్న పీఎం, కాంగ్రెస్ మీద వచ్చిన నివేదికకు మాత్రం చప్పట్లు కొట్టడాన్ని ఏమనాలి?  అంతా ద్వంద్వ నీతి! 2024 పార్లమెంట్ ఎన్నికలలో దీని ప్రభావం బీజేపీ మీద ఉండే అవకాశం లేకపోలేదు, పీఎం నరేంద్ర మోడీ ఎలాగైతే రాఫెల్, పెగాసస్ పై పార్లమెంట్ లో తమకు బలం ఉందనే ఒకే ఒక్క కారణం తో తొక్కి పడేసారో, ఆ విధంగా అదానీ సంకటాన్ని అణచి వేయలేరు. ఇది లక్షలాది ఇన్వెస్టర్ల సమస్య. తిమ్మిని బమ్మిని చేయలేరు!