పవిత్ర ఆధ్యాత్మిక స్థలిగా మౌలాలి రంగనాథ ఆలయం

పవిత్ర ఆధ్యాత్మిక స్థలిగా మౌలాలి రంగనాథ ఆలయం

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ

మౌలాలి శ్రీరంగనాథ స్వామి దేవాలయాన్ని నగరంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఏ సాయం అవసరమైనా అన్నివేళలా, అన్నిరకాలుగా ముందుంటానని ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారంనాడు తిరుప్పావై ధనుర్మాసోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయంలో గోశాల నిర్మాణ, నిర్వహణకు సంబంధించిన పనులను ఆయన స్వయంగా సమీక్షించారు. కొండమీద గోశాల వేలాది భక్తులకు ఒక పవిత్ర పూజాస్థలిగా మారుతుందని అన్నారు.

విరాహత్ అలీకి ఘనసన్మానం

అంతకుముందు సుప్రసిద్ధ సీనియర్ పాత్రికేయులు విరాహత్ అలీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి సహా ఎందరో రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ సామాజికంగా, వైద్యపరంగా పేద, బడుగు ప్రజలకోసం శ్రీరామానుజ సేవాట్రస్ట్ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎందరో ప్రముఖుల సమక్షంలో ట్రస్టు చైర్మన్ డాక్టర్ ధనుంజయ తనకు జరిపిన సన్మానికి కృతజ్ఞతగా స్పందిస్తూ వైద్యపరంగా ఎందరో పేదలకు అత్యవసర వైద్య సహాయాన్ని అందించడమే కాక ఖరీదైన ఆపరేషన్లను ఉచితంగా చేయించిన రామానుజ సేవాట్రస్ట్ సేవానిరతిలో ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు. విద్యాపరంగా ఎందరో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఫీజులు, కోచింగ్, వసతి తదితర సౌకర్యాలను కల్పించి భరోసా కల్పించిందని అన్నారు.

ఇలా ఆధ్యాత్మిక, సామాజిక సేవారంగాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న శ్రీరామానుజ సేవాట్రస్ట్ కు ఏరకమైన సహాయ సహకారాలు అవసరమైనా అందించడానికి సిద్ధంగా వున్నానని విరాహత్ అలీ చెప్పారు. ట్రస్టు సూత్రధారి ధనుంజయ పిలిస్తే సాయం అందించే డాక్టరుగా ఎందరో పేదలకు అండగా నిలుస్తున్నారని అభినందించారు. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాంగణంలో వందలాది మంది భక్తుల మధ్య తనకు సన్మానం జరగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో జర్నలిస్టు గా విరాహత్ అలి స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి ప్రస్తావించారు.