రామ‌న్ పాడ్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయండి

రామ‌న్ పాడ్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయండి
  • రైతాంగం కోసం సత్వరం చర్యలు తీసుకోండి
  • సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశాలు
  • రామ‌న్ పాడ్ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు 

ముద్ర ప్రతినిధి,కొల్లాపూర్:- ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్  జిల్లా రైతాంగానికి ఖ‌రీఫ్ పంట చివ‌రి త‌డికి  నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామ‌న్ పాడ్  జ‌లాశ‌యం నుంచి విడుద‌ల చేయాల‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నీటిపారుద‌ల శాఖ‌ అధికారుల‌ను ఆదేశించారు.  

ఖ‌రీఫ్ పంటకు సరిపడా నీరులేక పంట‌లు ఎండిపోతున్నాయ‌ని , క‌నీసం చివ‌రి త‌డికైనా నీటిని విడుద‌ల చేయాల‌ని ప‌లువురు రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  రామ‌న్ పాడ్ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించి, జ‌లాశ‌యంలో నీటి ల‌భ్య‌త‌పై నీటిపారుద శాఖ అధికారుల‌ను ఆరా తీశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా, పంట చివ‌రి త‌డికి సాగు నీరందేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

జూరాల నుంచి రామ‌న్ పాడ్ - గోపాల్ దిన్నె వ‌ర‌కు అమ‌ర‌చింత, ఆత్మ‌కూర్, మ‌ద‌నాపురం కొత్త‌కోట‌, పెబ్బేరు, శ్రీరంగ‌పురం, వీప‌న‌గండ్ల‌, చిన్నంబావి మండ‌లాలకు లెప్ట్ కెనాల్ ద్వారా చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు స‌మ‌కూరుతుందన్నారు.బీమా ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా కొత్త‌కోట‌, శ్రీరంగ‌పురం, వీప‌న‌గండ్ల‌, చిన్నంబావి, పెంట్ల‌వెల్లి మండలాల‌కు  చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు స‌మ‌కూరుతుందన్నారు. అయితే వ‌ర్షాభావ ప‌రిస్థితుల వ‌ల్ల  ప్రాజెక్ట్ లో నీటి ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉందనీ దీంతో క‌నీసం చివ‌రి త‌డికి నీరందంచాల‌ని రైతులు కోరుతున్నారనీ తెలిపారు. ఖ‌రీఫ్  పంట చివ‌రి త‌డికి నీటిని విడుద‌ల చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించ‌డంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఈ స‌త్య‌శీల రెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.