3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు  ఇచ్చాం

3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు  ఇచ్చాం
  • రాష్ట్రరోడ్లు భవనాలు,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :రాష్ట్రంలో మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్రరోడ్లు భవనాలు,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం ఆయన భువనగిరి పట్టణం స్థానిక న్యూ వివేరా హోటల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సాగునీరు,  తాగునీరు ప్రాజెక్టులపై చర్చించడం జరిగిందని, జిల్లాలో అదనంగా మరో 200 కోట్లతో గంధమల్ల,  బస్వాపూర్ పనులు పూర్తి చేసుకుని  మల్లన్న సాగర్ నుండి తాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. కొన్ని రోడ్లను కూడా మంజూరు చేసుకునే కార్యాచరణలో ఉన్నామని, జిల్లాలో రోడ్ల పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది తెలిపారు.  ఉద్యోగులు, ఉపాధ్యాయులు,  పెన్షనర్లకు  ఒకటో తారీఖునే వేతనాలు అందించి మళ్లీ పాత రోజులు తీసుకురావడం, గతంలో 15,  20 తారీకు మధ్యలో ఉద్యోగులకు వేతనాలు అంది అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారని చెప్పారు.  బ్యాంకులలో రుణాలకు సంబంధించి స్కోర్ కోల్పోతున్నారని అన్నారు.

గత మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, శాసనసభ్యులు మంత్రులు ఒక టీముగా ఏర్పడి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో ఐదు  అమలు చేస్తున్నామని, మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని,  వారి కళ్ళల్లో ఆనందం కనబడుతున్నదని,  అలాగే ఈ నెల నుండి కరెంటు జీరో బిల్లు చూసి ప్రజలు సంతోషపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిస్టం ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.  మెగా డీఎస్సీ ప్రకటించామని వచ్చే నెలలో ఎగ్జామ్ ఉంటుందని, అలాగే 565 గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈనెల 11వ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తారన్నారు. అన్ని గ్రామాలను తిరుగుతున్నామని,  సమస్యలను పరిష్కరిస్తున్నామని,  బస్వాపూర్ R&R సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 200 విద్యుత్ యూనిట్ల ఉచిత పథకం మొదలుపెట్టామని, భారతదేశంలో 500 రూపాయలకే గ్యాస్ పథకం ఎక్కడ లేదని, మిగతా 700 రూపాయలు వారి అకౌంట్లలో పడతాయని అన్నారు.  ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రథమ దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రధానమంత్రిని గారిని కలిసి త్రిబుల్ ఆర్ పనులకు సంబంధించి నిధులు అడగడం జరిగిందని, త్రిబుల్ ఆర్ వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా,  ఎవరికి నష్టం కలగకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్ గా మారుతుందని అన్నారు.  రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్ల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పనులకు 1150 కోట్లతో టెండర్లను పిలవడం జరిగిందని, అలాగే రాయగిరి బ్రిడ్జి రోడ్డు పనులు కూడా వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రజలకు అందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,  తుంగతుర్తి ఎమ్మెల్యే  మందుల సామెలు,  ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.