నాది విజన్‌ అయితే జగన్‌ది పాయిజన్‌ : చంద్రబాబు నాయుడు

నాది విజన్‌ అయితే జగన్‌ది పాయిజన్‌ : చంద్రబాబు నాయుడు

పొన్నూరు : వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని, టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పిల్లలు, తెలుగుజాతి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలపై ఉందన్నారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ మార్క్‌ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడం, రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం, రివర్స్‌ నిర్ణయాలతో రివర్స్‌ పాలన.. ఇదీ సీఎం జగన్‌ మార్క్‌. గంజాయి సరఫరాలో ఏపీని నంబర్‌ వన్‌ చేశారు. ఈ ఘనతా ఆయనకే దక్కుతుంది. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేయడం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్‌. నాది విజన్‌ అయితే జగన్‌ది పాయిజన్‌.

టీడీపీ తోనే అమరావతికి పూర్వ వైభవం

అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయిఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. దేశంలోని టాప్‌-10 వర్సిటీలు, స్కూళ్లు రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నాం. అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారు. టీడీపీ కట్టిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకున్నారు. అమరావతికి పూర్వ వైభవం కేవలం తెదేపాతోనే సాధ్యపడుతుంది. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ప్రజలకు బంగారు భవిష్యత్తు అందిస్తా

మేము సైతం సిద్ధంగా ఉన్నాం

ఉద్యోగులు, పింఛన్‌దారులకు రూ.20 వేల కోట్లు, గుత్తేదారులకు రూ.95 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. పోలీసులు పారదర్శకంగా పనిచేయకపోతే ప్రమాదం వస్తుంది. తప్పుడు పనులను సమర్థించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. పోలీసుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. వైసీపీ నేతలు ‘సిద్ధం’ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే వైకాపాను లేకుండా చేయాలి. ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు మేమూ సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పోలవరం, అమరావతిని పూర్తి చేసుకుందాం’’ అని చంద్రబాబు అన్నారు.