మద్యం వేలానికి టెండర్లు వేసిన జాతర నిర్వాహకులు... 

మద్యం వేలానికి టెండర్లు వేసిన జాతర నిర్వాహకులు... 
  • ఖరీదుగా మారిన చిన మేడారం జాతర...
  • అడుగడుగునా భక్తుల నిలువు దోపిడీకి టెండర్లు వేసిన నిర్వాహకులు...
  • సంబంధిత శాఖల నిర్లక్ష్యం హస్తంతో  కార్యకలాపాలు...

ముద్ర/రాజాపేట:- రాజపేట మండలం చిన్న మేడారం జాతర నిర్వాహకులు అధికారుల అండదండలతో అక్రమ ధనార్జనకు, భక్తుల నిలువు దోపిడీకి టెండర్లు పూర్తి చేశారు. ఏకంగా ఎక్సైజ్ పోలీసు శాఖల అధికారుల కళ్ళు కప్పి బెల్ట్ షాపులకు ఇండర్ వేశారు. అందుకోసం ఓ వ్యక్తికి 45 వేల రూపాయలకు టెండర్ ఖరారు చేసి డబ్బులు వసూలు చేశారు. టెండర్ దక్కించుకున్న సదరు వ్యక్తి జాతరలో ఎన్నైనా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవచ్చని ఎంత ధర కైనా మద్యాన్ని విక్రయించుకోవచ్చని నిర్వాహకులు అభయం ఇచ్చారు. అందుకోసం అధికార పార్టీ ప్రతినిధులతోనూ, ఎక్సైజ్ పోలీసు అధికారులతో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తాము అన్ని చూసుకుంటామని నిర్వాహకులు మద్యం టెండర్లు దక్కించుకున్న వ్యక్తికి అభయమిచ్చారు.

మద్యం టెండర్లతోపాటు అధికారులను అడ్డం పెట్టుకొని అనేక అక్రమ టెండర్లు వేసి 15 నుండి 20 లక్షల రూపాయల ఆదాయాన్ని భక్తుల నుండి వసూలు చేసేందుకు నిర్వాహకుల సిద్ధంగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి చిన్న మేడారం జాతర నిర్వాహకులు భక్తుల ఆర్థిక దోపిడీని కొనసాగిస్తూనే ఉండగా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే  పేదల దేవతలుగా చెప్పుకుంటున్న సమ్మక్క సారలమ్మ దర్శనం చిన్న మేడారంలో ఖరీదుగా మారడం పట్ల భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తమ నిజాయితీని చాటుకోవాలని కోరుతున్నారు. రాజపేట మండలంలో చల్లూరు, లక్ష్మక్కపల్లి మేడారం జాతరలు పేదలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఖర్చు లేకుండా దర్శనాలు మొక్కులు కానున్న నేపథ్యంలో చిన్న మేడారం జాతర నిర్వాణ పరిస్థితి ఈ విధంగా ఉండడం విశేషం. చిన్న మేడారం జాతరలో మద్యం విక్రయ టెండర్ల పై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులను ఫోన్ ద్వారా వివరణ కోరే ప్రయత్నం చేయగా వారు  స్పందించలేదు.