పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలు

పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలు
  • పెద్దపల్లి నుండి పోటీలో ఎస్.కుమార్
  • పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు
  • బలమైన నాయకుడిగా గుర్తింపు
  • ఇప్పటికే ఎలక్షన్ క్యాపెయినింగ్
  • ఎస్.కుమార్ కే టిక్కెట్ కేటాయిస్తుందని టాక్

ముద్ర, గోదావరిఖని టౌన్:పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.కుమార్ ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా పెద్దపల్లి పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలో వాల్ రైటింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ నెలకొంది. 2004లో రామగుండం మున్సిపల్ చైర్మన్ రేసులో ఎన్నికల్లో పోటీకి దిగి స్వల్వ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి లక్షకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ వరకు బీజేపీ టిక్కెట్ విషయంలో ఉత్కంఠత కొనసాగడం.. ఆ తర్వాత చివరి క్షణంలో ఎస్.కుమార్ పేరును ప్రకటించడం.. ప్రచారానికి గడువు లేకున్నా చురుకైన నేత కావడంతో భారతీయ జనతా పార్టీకి మంచి ఓట్ షేర్ ను తీసుకురావడంలో ఎస్.కుమార్ సఫలీకృతమయ్యారు. పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవంతో పాటు విద్యావేత్తగా, సింగరేణి ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఎస్.కుమార్ కు ఇమేజ్ ఉంది. దీంతో పార్టీ టిక్కెట్ ఎస్.కుమార్ కే కేటాయిస్తుందని టాక్ నడుస్తోంది. పోటీ ఎలా ఉన్న ప్రచారపర్వంలో మాత్రం ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు ఎస్.కుమార్. ఇప్పటికే చెన్నూరు, పెద్దపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాపెయినింగ్ లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొలిటికల్ సీన్ ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తోంది. మహానేతలకు రాజకీయ పునాది వేసిన చోటు.. రాజకీయంలో మహామలుపులకు కారణం అయిన చోటు.. అందుకే ఇంత ఆసక్తి ! ఈ నాలుగేళ్లలో పెద్దపల్లి చుట్టూ జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. పలకరించిన వివాదాలు.. పార్టీలను టెన్షన్‌ పెట్టిన వివాదాలు ఎన్నో ! అలాంటి పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైట్ ఎలా ఉంటుందా అని తెలంగాణ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చేసింది అన్న రేంజ్‌లో ఇక్కడ రాజకీయం రగులుతోంది.

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఎస్పీ రిజర్వ్‌డ్‌. పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాలతో పాటు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలైన ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. 1962లో పెద్దపల్లి పార్లమెంట్‌కు మొదటిసారి ఎన్నికలు జరగగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉంది. మధ్యలో టీడీపీ రెండుసార్లు విజయం సాధించినా.. తిరిగి కాంగ్రెస్‌ చేతుల్లోకి వచ్చేసింది. పెద్దపల్లి పేరు చెప్తే వినిపించే పేరు కాకా అలియాస్‌ వెంకస్వామి. ఐతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పెద్దపల్లిని కారు కబ్జా చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్‌పై.. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్కసుమన్‌ విజయం సాధించారు. 2019లోనూ కారు పార్టీనే పాగా వేయగలిగింది. గులాబీ పార్టీ నుంచి వెంకటేష్‌ నేత విజయం సాధించి.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, మోదీ మేనియా హైప్ లో ఉన్న ఈ తరుణంలో పెద్దపల్లి నియోజకవర్గంపై పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈసారి పెద్దపల్లి ఎంపీ సీటును ఎలాగైనా సాగిస్తామని ఆ పార్టీ నాయకుడు ఎస్.కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 2024 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం సరికొత్త రీతిలో సాగుతుందనడంలో సందేహం లేదు.