కాంగ్రెస్ పార్టీని న‌మ్మి మోస‌పోకండి

కాంగ్రెస్ పార్టీని న‌మ్మి మోస‌పోకండి
  • తాండూరు బిడ్డ‌గా ఆశీర్వ‌దించండి.. మ‌రింత అభివృద్ధి చేసి చూపిస్తా
  • తాండూరు ప‌ట్ట‌ణంలో  పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:కాంగ్రెస్ కు ఓటేస్తే చీక‌టి రోజులే అని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని 10,11,12 వార్డుల్లో ప్ర‌జా ఆశీర్వాద యాత్ర‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీల‌న్నీ దొంగ హామీలే అన్నారు. తాండూరు పట్టణంలో ఆదర్శవంత ప్రాంతంగా సాయిపూర్ ను తీర్చిదిద్దుకున్నామన్నారు. కాలుష్యరైత ప్రాంతంగా తాండూరును మార్చి చూపించిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డిదేనన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ప్రాంతం తీవ్ర ఇబ్బంది పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్రం సాధించుకున్నాం... అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. 100 శాతం భగీరథ నీళ్లతో, ఫ్లాడ్ లైట్ ల వెలుగులలో సాయి పూర్ ప్రాంతం ప్రాంతం పూర్తిగా మారిపోయిందన్నారు. 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పరిపాలనలో తాండూర్ ప్రాంతం వివక్షకు గురి అయిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తాండూరు పట్టణ అభివృద్ధిని పట్టించుకోక పోవడం వల్ల నిర్లక్ష్యానికి గురైందన్నారు.  తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంచలంచలుగా అభివృద్ధి పథంలో తాండూరు నియోజకవర్గం ముందుకు వెళుతుందన్నారు. 

గత రెండు సంవత్సరాల నుండి తాండూరు నియోజకవర్గ రూపురేఖలను పూర్తిగా మార్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులను తీసుకువచ్చామన్నారు. సాయిపూర్ లో ఎక్కువమంది రైతులే ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలను ఈ ప్రాంత రైతులు అనుభవించారన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక బాయిల కాడ కరెంట్ వచ్చినప్పుడు మోటార్లు ఆన్ చేస్తూ పాముకాట్లకు, తేలుకాట్లకు, కరెంటు షాకులకు గురై మరణించిన సంఘటనలు మనమనేకం చూసామన్నారు.  రైతు సంక్షేమం కొరకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసి రైతుబంధు,  రైతు బీమా అనేక రైతు సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గతంలో పెట్టుబడి లేక సేట్ల వద్దకు వెళ్లి గంటలు తరబడి నిలబడి డబ్బులు తెచ్చుకునే వాళ్లమన్నారు. పంట పండిన తర్వాత అసలు, మిత్తి సేటుకు చెల్లించిన తర్వాత లాభం ఏమి మిగలకపోయేదన్నారు. అలాంటి ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి  రూ.10,000 అందిస్తుందన్నారు. గతంలో మద్దతు ధర రాక ధాన్యాన్ని రోడ్డు పాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఇప్పుడు దాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు, ఆడపడుచులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి 100% అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఈనెల 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించాలన్నారు.

నూతన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు పెట్టుబడి సాయాన్ని పదివేల నుండి 16 వేలకు పెంచబోతున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200 నుండి 400కు తగ్గించునున్నామన్నారు. నిరుపేద కుటుంబంలో ఒక మహిళకి సౌభాగ్య లక్ష్మి పథకం కింద రూ.3016 లను అందించనున్నామన్నారు. దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారన్నారు.‌  మరణించిన రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదని ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా రూపాయలు ఐదు లక్షలని ప్రభుత్వం అందిస్తుందన్నారు.  భూమిలేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి కేసీఆర్ బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అందించనున్నామన్నారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతికై ప్రతి వార్డులో సొంత నిధులతో భవనాలను నిర్మించనున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీని న‌మ్మి మోస పోకూడ‌ద‌ని.. సారు కేసీఆర్  నాయ‌క‌త్వంలో తెలంగా అభివృద్ధిలో దూసుకుపోతుంద‌న్నారు. మ‌న సంక్షేమ ప‌థ‌కాలు రెట్టింపు కావాలంటే మ‌ళ్లీ సారే కావాలి కాబ‌ట్టి కారు గుర్తుకు ఓటేసి  కేసీఆర్ ని హాట్రిక్ సీఎం చేయాల‌న్నారు. అలాగే మునుపెన్న‌డూలేని విధంగా ఏకంగా 16 వంద‌ల 80 కోట్ల‌తో తాండూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసిన మీ బిడ్డ రోహిత్ రెడ్డిని మ‌రోసారి ఆశీర్వ‌దించి, మీకు సేవ చేసే భాగ్యం క‌ల్పించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌టోళ్ల దీప , మార్కెట్ క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ వీణా శ్రీనివాస్ చారి , బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ప‌టోళ్ల న‌ర్సింహుల్ ,  కౌన్సిలర్లు, వార్డు స‌భ్యులతో పాటు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.