సీఎం కేసీఆర్-అభివృద్ధి సంక్షేమానికి మద్దతుగా బీఆర్‌ఎస్‌లో చేరికలు..

సీఎం కేసీఆర్-అభివృద్ధి సంక్షేమానికి మద్దతుగా బీఆర్‌ఎస్‌లో చేరికలు..

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: సీఎం కేసీఆర్‌  చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే  బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని ఇందూర్ మరియు మంబాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో  బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి  మాట్లాడుతూ  సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అని పేర్కొన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టో గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. గడపగడపకూ తిరుగుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేదని .. తాండూరులో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు.