రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొంగలు పడ్డారా... దొంగిలించారా...?

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొంగలు పడ్డారా... దొంగిలించారా...?
  • విలువైన ఫర్నిచర్  కంప్యూటర్  ఏసీలు ఫ్యాన్లు ఎత్తుకెళ్లింది ఎవరూ...? 
  • పోలీస్ లకూ ఫిర్యాదు చేసేందుకు  సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దొంగలు పడ్డారా లేక దొంగలించారా... అంటే కాదని కొందరు.... అవునని అధికార పార్టీ వాళ్లే దొంగలించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలువైన వస్తువులన్నీ చోరీకి గురవడం  రామగుండంలో సంచలనం రేపింది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు  సంబంధించిన అనుచరులే,  విలువైన వస్తువులన్నీ తీసుకు వెళ్లినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్, ఏసీలు కంప్యూటర్లు ఇతర వస్తువులు  బీఆర్ఎస్  నేతల ఇండ్లకు చేరినట్లుగా వారు ఆరోపిస్తున్నారు.

రామగుండం ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన కాంగ్రెస్ నాయకుడు  రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలోకి రానుండడంతో కాంగ్రెస్ శ్రేణులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి చూడగా, కార్యాలయం మొత్తం ఖాళీగా కనిపించడంతో అవక్కయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర వస్తువులు ఏవి లేకుండా పోవడంతో ఏం జరిగిందనేది అర్థం కాకుండా ఉంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్లు కంప్యూటర్ లో నిక్షిప్తమై ఉన్న డాటా, లభించని పరిస్థితి ఉంది. గతంలో రామగుండం ఎమ్మెల్యేగా ఉన్న  సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించిన  ఎలాంటి  వస్తువులను తీసుకు వెళ్లలేదని, ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అనుచరులు వస్తువులను పట్టుకెళ్ళడం పట్ల రామగుండంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఫైల్ మాయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సి సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.