విఠలాచార్య గ్రంథాలయాలతో రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయం : రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్

విఠలాచార్య గ్రంథాలయాలతో రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయం : రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్

రామన్నపేట ముద్ర: డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయాల ద్వారా రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ అన్నారు.సోమవారం నాడు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఈరోజు చాలా పనులలో ఉన్నా కూడా గ్రంథాలయాన్ని ప్రారంభించాలని వచ్చానని, మహానుభావుడు ఆచార్య కూరెళ్ల గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని, అందుకు కారణం ఆయన పుస్తక పఠనం కోసం చేస్తున్న పనులని, పుస్తకాలు మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాయని,  మంచి స్థానం కల్పిస్తాయని, ఈరోజు వెల్లంకి గ్రామానికి రాజ్ భవనే వచ్చిందని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎల్లంకి గ్రామాన్ని, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రస్తావించడం పట్ల ప్రధానమంత్రికి  కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

యువత పోటీ పరీక్షలకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెల్లంకి ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఆచార్య కూరెళ్ల ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అని, చదవడం కోసం వారు గ్రంథాలయాలకు చేస్తున్న సేవల పట్ల, రాబోయే తరాలకు వారు అందిస్తున్న పుస్తకాల పట్ల వారికి నేను శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కోనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ గ్రంథాలయాల పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారని, కూరెళ్ల గ్రంధాలయానికి 8500 పుస్తకాలు, 1000 నోటు బుక్కులు అందజేస్తున్నారని తెలిపారు. గ్రంథాలయానికి మంజూరు చేసిన  చేసిన 10 లక్షల 63 వేల 470 రూపాయల శాంక్షన్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర గవర్నర్ కూరెళ్ల విఠలాచార్యకు అందజేశారు. ఈ సందర్భంగా కూరెళ్ల విఠలాచార్య కుటుంబ సభ్యులు రాష్ట్ర గవర్నరును సన్మానించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ హనుమంతుకే జెండగే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, కవులు, రచయితలు సాహిత్య ప్రియులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.