కారెక్కిన ‘కుంభం’

కారెక్కిన ‘కుంభం’

ముద్ర, తెలంగాణ బ్యూరో/ ముద్ర, ప్రతినిధి భువనగిరి: కాంగ్రెస్​ కీలక నేత కుంభం అనిల్​ కుమార్​రెడ్డి బీఆర్​ఎస్​లో చేరారు. ప్రగతిభవన్​లో సోమవారం రాత్రి సీఎం కేసీఆర్​ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్​లో నెలకొన్న వర్గ విభేదాల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయన సోమవారం సాయంత్రం ప్రగతిభవన్​లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి జగదీశ్​రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి తీరు మారకపోతే పార్టీ వీడుతానని సోమవారం ఉదయం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సంకేతాలిచ్చిన కుంభం సాయంత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్​రెడ్డి తో కలిసి ప్రగతిభవన్​కు సీఎం కేసీఆర్​తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్​తో భేటీ  తర్వాత ఆయన బీఆర్​ఎస్​లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్​ కండువా కప్పి పార్టీకి చేర్చుకున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా అవకాశం కల్పించేందుకు బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. కుంభం తో పాటు వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు సహా పలువురు కాంగ్రెస్​నేతలు బీఆర్​ఎస్​లో చేరారు. 

ఎంపీతో విభేదాలు
భువనగిరి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుండి కాంగ్రెస్​లో చేరికల పర్వం ఊపందుకున్న వేళ..  యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి పార్టీని వీడారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గ్రూపు రాజకీయాలకు వేగలేకపోతున్న కుంభం బీఆర్ఎస్ లో చేరారు, సోమవారం ఉదయం భువనగిరిలోని వివేరా హోటల్ లో పట్టణ, గ్రామ శాఖల కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సీనియర్లతో సమావేశమైన కుంభం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలీపై ఫైర్ అయ్యారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తూ తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డ ఆయన బీఆర్ఎస్ తనకు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపిన పార్టీ విడలేదని ముఖ్య నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి తీరు మారకపోతే పార్టీ వీడుతానని సమావేశంలో సంకేతాలిచ్చిన కుంభం సాయంత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్​రెడ్డి తో కలిసి ప్రగతిభవన్​కు సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. పార్టీలో చేరేముందే ఆయనకు వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా అవకాశం కల్పించేందుకు బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

విభేదాలకు కారణమిదే..!
కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కి శిష్యుడిగా పేరున్న కుంభం అనిల్ గత ఎనిమిదేళ్ల నుండి జిల్లా కాంగ్రెస్​లో సేవలందిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో తన ప్రత్యేక వర్గాన్ని పెంచిపోషించడమే కాకుండా కుంభం అనుచరులను దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడి ప్రమేయం లేకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్​కుంభం అనిల్ తో పాటు కోమటిరెడ్డి వర్గాలుగా చీలిపోయింది. తాజాగా వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్​నుండి బరిలో ఉండాలని నిర్ణయించుకున్న కోమటిరెడ్డి గత కొంతకాలంగా తన ముఖ్య అనుచరుడు రామాంజనేయ గౌడ్ కు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో తాజాగా కాంగ్రెస్​లో బీసీ నినాదం బలపడుతోన్న క్రమంలో పార్లమెంట్​పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని కోమటిరెడ్డి అధిష్టానానికి ప్రాతిపాదించిన విషయం తెలిసిందే.

దీంతో వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి నల్లగొండకు వెళితే..

భువనగిరి నుండి తన శిష్యుడు రామాంజనేయగౌడ్​ను బరిలో దింపుతారని గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సైతం నోరు మెదపకపోవడంతో అసంతృప్తితో ఉన్న కుంభం తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు.. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి కూతురు, కుంభం అనిల్​కుమార్​కూతురు ఓ చోట కలిసి చదువుకున్నారు. రేవంత్​రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన తర్వాత కుంభం అనిల్​నేరుగా రేవంత్​తో టచ్​లోకి వెళ్లిపోయారు. దీంతో వీరిద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ఇప్పటికే రేవంత్​తో విభేదాల ఆరోపణలు మూటగట్టుకున్న కోమటిరెడ్డి కుంభం కు చెక్​పెట్టేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో భువనగిరి జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయోననే ఆసక్తి నెలకొంది.