బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు వెళ్లేందుకు  ఏర్పాట్లు పూర్తి

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు వెళ్లేందుకు  ఏర్పాట్లు పూర్తి

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ 

భువనగిరి ముద్ర : బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ తెలిపారు. గురువారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో ఆయన మండల అభివృద్ధి అధికారులు,  మండల పంచాయితీ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్లతో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని రేపు 14 వ తేదీన హైదరాబాదులో నిర్వహించే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల వారిగా ప్రజలను తీసుకువెళ్లేందుకు చేపట్టిన పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నియోజక వర్గానికి 300 మంది ప్రజలు చొప్పున 6 బస్సులతో, మొత్తం 600 మందిని 12 బస్సులలో తీసుకెళ్లడం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి బస్సులో 50 మంది ప్రజలతో పాటు ఒక పోలీసు, ఇద్దరు లైజనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ప్రతి వ్యక్తికి ఐడి కార్డు ఇవ్వడం జరిగిందని, వారి సెల్ ఫోన్ నెంబర్లు లైజనింగ్ అధికారుల వద్ద ఉంటాయని, ప్రతి బస్సులో మంచి నీటి బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ప్రయిమరీ మెడికల్ కిట్ ఉంటాయని తెలిపారు.  సమయ పాలన పాటించాలని, రేపు ఉదయం దాదాపు 7 గంటల నుండి మండల కేంద్రం నుండి ప్రజలను తీసుకుని బస్సులు బయలుదేరతాయని, వారికి టిఫిన్, లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మనకు కేటాయించిన రూట్ మ్యాప్ ద్వారా నెక్లెస్ రోడ్ జల విహార్ వద్ద పార్కింగ్ స్థలం వద్దకు చేరుకోవాల్సి వుంటుందని తెలిపారు. సభ పూర్తయ్యే వరకు కూడా ఏ ఒక్కరు కూడా ప్ర్రాంగణం వీడకుండా చూడాలని, మళ్లీ వారంతా తిరిగి చేరుకునేంత వరకు కూడా లైజనింగ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలను తీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చేంత వరకు కూడా మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, అధికారులంతా సమన్వయంతో ప్రజలను తీసుకెళ్లి తిరిగి వెనక్కి తీసుకొని వచ్చేంత వరకు కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పనులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఎస్.సి. కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్యాంసుందర్, జిల్లా ఎస్.సి.  అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.