భౌతికవాద సిద్ధాంతాలకు జర్నలిస్టులు దగ్గరగా ఉండాలి

భౌతికవాద సిద్ధాంతాలకు జర్నలిస్టులు దగ్గరగా ఉండాలి

సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి పిలుపు 
ముద్ర ప్రతినిది, భువనగిరి: భావ వ్యాప్తి భౌతిక వ్యాప్తికి పరస్పర వ్యతిరేక వైషమ్యాలు ఉన్నాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమాజానికి ఉపయోగపడే మునుపటి జర్నలిజానికి ప్రస్తుత జర్నలిస్టులు శ్రీకారం చుట్టాలని సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి పిలుపునిచ్చారు.  గురువారం భువనగిరి పట్టణం లోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల భవనం లో కామ్రేడ్ కొలుపుల మల్లేశం స్మారకార్ధం జర్నలిస్టులకు అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అంతకు ముందు జర్నలిజం -సమాజం -బాధ్యత అనే అంశం పై సెమినార్ . కొలుపుల విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మల్లా రెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోరే జర్నలిస్టులకు ప్రస్తుతం రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తపరిచారు.

వారి సౌకర్యార్థం ప్రత్యేక రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజా అవసరాలను గుర్తు చేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని అన్నారు.ప్రజారంజక పాలన ను అందించే దిశగా పాలకులు ఉండాలని కోరుకునే వారు జర్నలిస్టులు అని గుర్తు చేశారు. వారి కనీస అవసరాలు తేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విషయ సంస్కృతి జరిగిందని ఆవేదన వ్యక్తపరిచారు. కార్పొరేట్ వ్యవస్థలో విలువలు లేవని పూర్తిగా లాభార్జననే ధ్యేయంగా ఉందన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం గా ఉన్న పత్రికలు నేడు కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. జర్నలిస్టులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు సేవ చేయాలన్నారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అవినీతి అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజాలను మాత్రమే రాయాలని కోరారు. 

పీసీసీ కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి తను చేసిన పోరాటాలకు నాటి పత్రికలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకువెళ్లాయన్నారు. దీంతోటే నాడు సమస్యలు పరిష్కారమయ్యాయి అన్నారు ప్రస్తుతం పెయిడ్ ఆర్టికల్ అనే వ్యవస్థ వచ్చిందని బాధాకరమన్నారు. ఎలక్షన్లలో యాజమానులు తమ పత్రికలను కాపాడుకోవడం కోసం జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు ఎండి   ఖాజా, గోవర్ధన చారి, ఎంబా నరసింహులు, మడికొండ మల్లేశం, మరాఠీ రవి, పత్తిపాటి ఆనంద్, పాశం నవీన్, గడిసందుల నాగరాజు, కూరెళ్ల మల్లేశం, గుండేటి హరిబాబు, భువనగిరి మల్లేశం, ముత్యాల జలంధర్ శ్రీనివాస్, కొడారీ వెంకటేష్ కొలుపుల మల్లేశం స్మారక జర్నలిస్టు ఉత్తమ అవార్డులను అందజేశారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య  రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద ఆధ్వర్యంలో  నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుర్రాల శివ, కొలుపుల నిఖిలేశ్వర్, కొలుపుల రమేష్, ఆరే విజయ్ కుమార్, అజయ్ సింగ్ పాల్గొన్నారు.