తల్లిని నరికి చంపిన కొడుకు, కోడలు అరెస్టు

తల్లిని నరికి చంపిన కొడుకు, కోడలు అరెస్టు
Son and daughter in law arrested for mother to death

ముద్ర ప్రతినిధి, జనగామ:  తనకు భూమి ఇవ్వడం లేదని తల్లిని నరికి చంపిన కొడుకు, కోడలును జనగామ పోలీసులు అరెస్టు చేశారు.  శుక్రవారం స్థానిక డీసీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  డీసీపీ సీతారాం వివరాలను వెల్లడించారు.  జనగామ మండలంలోని మరిగడికి చెందిన కూరాకుల రమణమ్మను  ఆమె కుమారుడు కన్నప్ప కత్తితో నరికి చంపినట్లు,  అందుకు సహకరించిన భార్య కళ్యాణితో పాటు కన్నప్పను  అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

భూ వివాదం నేపథ్యంలోనే కన్నప్ప తల్లిని హత్య చేశాడని తెలిపారు.  సమాజంలో రోజురోజుకూ మానవ విలువలు తగ్గిపోతున్నాయని, కన్నతల్లినే కడతేర్చిన దుర్మార్గులు ఉన్నారన్నారు.  ఇలాంటి వారిని చట్టం  కఠినంగా శిక్షిస్తుందన్నారు. భూ అక్రమాలకు బెదిరింపులకు పాల్పడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్,  ఎస్సైలు జీనత్,  రఘుపతి తదితరులు పాల్గొన్నారు.