చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు బొంద పడతారు

చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు బొంద పడతారు

పేపర్ల లీకుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం : బీజేపీ పై స్పీకర్ పోచారం  ధ్వజం

 బాన్సువాడ, ముద్ర:  చిల్లర రాజకీయాలు చేస్తూ, మంచి చేసే రాజకీయాలు చేయకపోతే ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పై ధ్వజమెత్తారు.  నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాయకూర్ లో జరిగిన రుద్రూరు మండల భారత రాష్ట్ర సమితి  పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల "ఆత్మీయ సమ్మేళనం" లో భార్య పుష్పతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈసందర్భంగా పోచారం  మాట్లాడుతూ..

ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా హాజరయ్యానని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తుంటారని అన్నారు. తన రాజకీయ జీవితం 1977 లో మొదలైందని,ఎంతో మంది రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను చూసానని,కానీ మంచి స్వభావం, దయదాక్షిణ్యాలు, దానధర్మాలు, సహృదయంతో పేదలకు సంక్షేమాన్ని అందించాలని పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కొంతమందికి కేసీఆర్ ను ఎదుర్కొనే దైర్యం లేదని అన్నారు. ఈమధ్య కొత్త బిచ్చగాళ్లు బయలుదేరారని, వీరికి దమ్ము, దైర్యం ఉంటే ప్రజలను మెప్పించి ఓట్లు గెలుచుకోవాలని అన్నారు.

కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నదని, మేము చేసిన దానికంటే ఎక్కువగా చేసి పోటీ పడాలని అన్నారు. నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెడుతున్నారని,ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కొంతమంది దొంగలను ప్రోత్సహించి SSC పరీక్షా పత్రాలను లీక్ చేయించారని ఆరోపించారు. తద్వారా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని,ఇదో దుర్మార్గమైన చర్య, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. మీకు ఈ హక్కు ఎవరిచ్చారని, చేసేది అంతా వాళ్ళే, అందుకే జైలుకు వెళ్ళారుని అన్నారు. దొంగనే దొంగ దొంగ అని మొత్తుకుంటున్నారని,ఇంకా మీరు బుద్ది తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే శిక్ష వేస్తారు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.రాజకీయం చెసే దమ్ముంటే దైర్యంగా ముందుకు రావాలన్నారు. గ్రామాలలో మీరు పది మంది ఉంటే మేము తొంబై మంది ఉన్నామని, ఇది నిత్యం జరిగే యుద్ధం, అయినా మేము భయపడడం లేదని, మా వెనుక కోట్లాది మంది ఆడబిడ్డల, రైతుల బలం, పేదల ఆశీర్వాదం ఉన్నాయన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.