రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్
దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుదాం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రాజెక్టుల నిర్మాణం పేరిట తెలంగాణలోని లక్ష కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారని, వారి పదేళ్ల అవినీతి పాలనకు చమరగీతం పాడి, కాంగ్రెస్​ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు.

పదేళ్లలో దొరల తెలంగాణను చూశారని, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని, ఒక లక్ష కోట్ల రూపాయలను ఒకటే ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను పూర్తిగా మార్చి, వారికి అనుగుణంగా డబ్బులు దోచుకొనేవిధంగా చేశారని అన్నారు. తానే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును చూశానని, కొన్ని రోజులకే కాళేశ్వరం పునాదులు లోపలికి కుచించిపోయాయని అన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం కోసం కాదు దాని ద్వారా ధనాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ఆ ప్రాజెక్టును నిర్మించారని రాహుల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని చారిత్రాత్మక నగరంగా మార్చామని, విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచామని అన్నారు.

  కేసీఆర్​కు ప్రజలే బుద్ధి చెప్పాలి : రేవంత్​రెడ్డి
కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్​కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడైతే కేసీఆర్ కామారెడ్డిలో నిలబడతానని ప్రకటించారో, అప్పుడే షబ్బీర్ అలీ రాహుల్ గాంధీని కలిసి, రేవంత్​రెడ్డిని పంపాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్​ను ఓడించడానికే తనను కామారెడ్డికి పంపారని తెలిపారు. తన పూర్వీకుల ఊరు కామారెడ్డిలో ఉందని చెబుతున్న కేసీఆర్, గత పదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కామారెడ్డికి వచ్చాడా? అని ప్రశ్నించారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణలో విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ప్రణాళికలు చేశామన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఈ సభలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, రాష్ట్ర ఇన్​చార్జి మాణిర్రావు ఠాక్రే, మూడు నియోజకవర్గాల అభ్యర్థులు మదన్మోహన్, రవీందర్రెడ్డి, లక్ష్మికాంత్​రావు తదితరులు పాల్గొన్నారు.