ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్

ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్
  • ధరణి పోర్టల్ లక్షల ఎకరాలకు ఎసరు
  • రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుదాం
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రాజెక్టుల నిర్మాణం పేరిట తెలంగాణలోని లక్ష కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారని, వారి పదేళ్ళ అవినీతి పాలనకు చమరగీతం పాడి, కాంగ్రెస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు. పదేళ్ళలో దొరల తెలంగాణను చూశారని,, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని, ఒక లక్ష కోట్ల రూపాయలను ఒకటే ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను పూర్తిగా మార్చి, వారికి అనుగుణంగా డబ్బులు దోచుకొనేవిధంగా చేశారని అన్నారు. తాను స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును చూశానని,కొన్ని రోజులకే కాళేశ్వరం పునాదులు లోపలికి కుచించిపోయాయని అన్నారు. రైతులకు సాగు నీరు ఇవ్వాలనే లక్ష్యం కోసం కాదు దాని ద్వారా ధనాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ఆ ప్రాజెక్టును నిర్మించారని రాహుల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని చారిత్రాత్మక నగరంగా మార్చామని, విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ ఖ్యాతిని ఫ్రెంచామని అన్నారు.

ధరణిలో అన్నీ అక్రమాలే కంప్యూటరైజేషన్ పేరిటి కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకువచ్చి, 20 లక్షల ఎకరాల భూమిని లాక్కొనేందుకు కుట్ర చేశారన్నారు. లక్షల మంది రైతుల నుంచి అన్యాయంగా భూములను లాక్కొని వారి స్నేహితులకు కట్టబెట్టారని అన్నారు. పైసలు సంపాదించే మంత్రిత్వ శాఖలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అవినీతికి పాల్పడ్డారన్నారు. దళిత బంధు ఒక్కొక్క యూనిట్లో ఎమ్మెల్యేలు రూ. 3 లక్షల చొప్పున కమిషన్ తీసుకున్నారని, టిఎస్పిఎస్సీ పరీక్షల నిర్వహణలోనూ విఫలమయ్యారని, కేసీఆర్ బంధువులు, మిత్రులుంటే ఆ పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించే అవకాశం కల్పించారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో రోడ్లను నిర్మించామని, పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను నిర్మించామని అన్నారు.  

     

                   

బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఒక్కటే బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని రాహుల్ గాంధి పేర్కొన్నారు. నరేంద్రమోడీ ఢిల్లీలో చెప్పేదే కేసీఆర్ హైదరబాద్లో చేబుతారన్నారు. లోకసభలో మోడీకి అవసరమైనప్పుడల్లా కేసీఆర్ మద్దతు పలుకుతారని, రైతుల నల్ల చట్టం, నోట్ల రద్దు. చట్టం అన్నీటికి మద్దతు పలికారనాన్నరు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే నాపై 24 కేసులు నమోదు చేశారని, 55 గంటల పాటు తనను ప్రశ్నించారని, లోక సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, ఇంటిని లాక్కున్నారని తెలిపారు. కేసీఆర్, నరేంద్రమోడీతో కలిసి ఉన్నందునే ఆయనపై ఎలాంటి విచారణ జరపకుండా, సిబిఐ దాడులు జరగడం లేదన్నారు. నా ఇంటిని లాక్కోగా, నాకు కోట్ల మంది ప్రజల మనస్సులో ఇళ్ళు ఉన్నాయని అన్నారు. బిజెపి వారు ముందు తెలంగాణలో ఏదో చేద్దామనుకున్నారని, ఆ తర్వాత పూర్తిగా మారిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిజెపి గాలి మొత్తం తీసేసిందని, నాలుగు టైర్లను పంక్చర్ చేశామని అన్నారు.

ఓబిసిని ముఖ్యమంత్రి చేస్తామన్న బిజెపి, 2 శాతం ఓట్లు ముందుగా తీసుకురావాలన్నారు. బిజెపి, బిఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం ఉందని, ఎక్కడ చూసినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటుందని, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ చేసినా, మా అభ్యర్థులపై ఎంఐఎం అభ్యర్థులను నిలబెడతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు తాను ఒకటే ఆదేశించానని, గతంలో బిజెపి, ఇతర పార్టీల ప్రభుత్వాలు పేదల నుంచి దోచుకున్న ధనాన్ని మళ్ళీ పేదలకు పంచిపెట్టాలని చెప్పినట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2,500 ఖాతాల్లో జమ చేస్తామని, రూ.500లకే గ్యాస్సిలిండర్ అందిస్తామని, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఇలా ప్రతీ నెల 5వేలను అందిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో ఏటా 15 వేలను చెల్లిస్తామని, రూ.12 వేలను కూలీలకు అందిస్తామని, 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తామని అన్నారు. కేసీఆర్ లక్షలాది మందిని నిరాశ్రయులు చేయగా, తాము రూ.5 లక్షలను ప్రతీ ఒక్కరికి అందిస్తామన్నారు. తెలంగాణ అమరవీరులకు 250 గజాల ప్లాట్ను అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు విద్యాభరోసా కార్డు ద్వారా రూ.5 లక్షలు అందిస్తామని, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ను నిర్మిస్తామని, చేయూత ద్వారా రూ.4 వేలు అందిస్తామన్నారు. ఈ గ్యారెంటీలన్నీటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలో చట్టం చేసి అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని, మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సహకరించాలన్నారు. కామారెడ్డిలో రేవంత్రెడ్డి పోటీ చేస్తున్నారని, బిఆర్ఎస్కు ఒక్క ఓటు కూడా వేయవద్దని అన్నారు. ప్రజల తెలంగాణ అనే స్వప్నాన్ని పూర్తి చేస్తామన్నారు..

కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పాలి : రేవంత్రెడ్డి

కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడైతే కేసీఆర్ కామారెడ్డిలో నిలబడతానని ప్రకటించారో, అప్పుడే షబ్బీర్ అలీ రాహుల్ గాంధీని కలిసి, రేవంత్రెడ్డిని పంపాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ను ఓడించడానికే నన్ను కామారెడ్డికి పంపారని తెలిపారు. తన పూర్వీకుల ఊరు కామారెడ్డిలో ఉందని చెబుతున్న కేసీఆర్, గత పదేళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కామారెడ్డికి వచ్చాడా లేదా చెప్పండని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు అధికంగా ఉన్నారు, వారు ఉపాధిని కోల్పోయినా వారిని పరామర్శించడానికి రాలేదని అన్నారు. బీడీ కార్మికులను ఆదుకోలేదని అన్నారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని అన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణలో విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకొనేందుకు ప్రణాళికలు చేశామన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : డికె శివకుమార్, కర్ణాటక డిప్యూటి సీఎం  

తెలంగాణలో రాష్ట్రంలో ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారని కర్ణాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని పదేళ్ళుగా కేసీఆర్ అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రనే దేశ చరిత్ర అని, కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, పేదల కోసం పని చేస్తుందని, కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చామని, వాటిని పరిపూర్ణంగా అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతామని, కర్ణాటక రాష్ట్రంలో అమలు కావడం లేదని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారని, మీరు మీ స్నేహితుల ద్వారా తెలుసుకొండి, లేదా వచ్చి తెలుసుకొండని సవాలు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఒకే నాణానికి రెండు వైపుల ఉన్న ముఖాలు అని, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదని అన్నారు. కేసీఆర్ ఓడిపోతాననే భయంతోనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, కేసీఆర్ నమ్మక ద్రోహి అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వగా, ప్రజలను మోసం చేసి రాష్టాన్ని దోచుకున్నారని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితున్ని ముఖ్యమంత్రి చేశారా అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్నారు. ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీటిని అమలు చేస్తుందని, మీ ఓటును బిఆర్ఎస్కు, బిజెపికు వేసి వేస్ట్ చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీకి వేయండని పేర్కొన్నారు. ఈ విజయభేరీ సభలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిర్రావు ఠాక్రే, మూడు నియోజకవర్గాల అభ్యర్థులు మదన్మోహన్, రవీందర్రెడ్డి, లక్ష్మికాంర్రావు తదితరులు పాల్గొన్నారు.