బాలికల సంక్షేమ హాస్టల్ లో దారుణం

బాలికల సంక్షేమ హాస్టల్ లో దారుణం
  • వేడి నీళ్లు పడి విద్యార్థినీలకు గాయాలు
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • పట్టించుకోని నిర్వాహకులు

ముద్ర,జమ్మికుంట:జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు)లో గత నాలుగు రోజుల క్రితం వేడి నీళ్ళు మీదపడి ప్రధాన కుక్ తో పాటు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా సోమగూడెం గ్రామానికి చెందిన శరణ్య అనే బాలిక పాఠశాలలో 9వ, తరగతి చదువుతోంది. గత నాలుగు రోజుల క్రితం హాస్టల్ లో వంట చేస్తున్న క్రమంలో శరణ్యతో పాటు జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన సిరి చందన అనే విద్యార్థిని రెండు కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థులతో పనులు చేయిస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సదరు బాలికలకు వంట చేసే సమయంలో వేడి నీళ్లు మీద పడి గాయాలు కావడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం వారి తల్లి,దండ్రులను పాఠశాలకు పిలిపించి ఇళ్లలోకి పంపించినట్టు సమాచారం నెలకొంది. శరణ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలో చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఇంటి వద్దనే ఆర్ఎంపీ వైద్యుని చేత చికిత్స చేయించుకుంటున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య ఖర్చులకోసం రూ.2వేలు ఇచ్చారని, మిగతా వైద్యానికి డబ్బుల కోసం ఫోన్ చేస్తే పాఠశాల నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని శరణ్య కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా స్టాక్ రావడంతో దించుకొని చేతులు శుభ్రం చేసుకొని వెళ్తున్న క్రమంలో వేడి నీళ్లలో బియ్యం పోస్తున్న సమయంలో వేడి నీళ్ళు మీద పడి గాయాలైనట్లు చెప్పారు. శరణ్య, సిరి చందన ఇద్దరు విద్యార్థులు మెస్ లీడర్లుగా వ్యవహరిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి

టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ కాంట్రాక్టర్ వర్కర్లను ఏర్పాటు చేయక, విద్యార్థులచే వంట పనులు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగింది. నిబంధనల మేరకు 8మంది వర్కర్లతో చేయించాల్సిన పనిని,4 మంది వర్కర్లతో చేయిస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.