ఇండ్ల పైనుంచే విమానం చక్కర్లు....

ఇండ్ల పైనుంచే విమానం చక్కర్లు....
  • మంథని ముత్తారం మండలంలో వారం రోజులుగా తిరుగుతున్న జెట్ విమానం...
  • ఆందోళనలో ఆయా గ్రామాల జనం...
  • సమాచారం లేదు అంటున్న అధికారులు..

ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:-ఎక్కడో ఆకాశంలో తిరగాల్సిన విమానం... ఇండ్లకు సమీపంలో తిరగడం ఎప్పుడైనా చూశారా...? సాధారణంగా ఎక్కడో విదేశాలలో మాత్రమే అలాంటి దృశ్యాలు అబ్బుర పరుస్తాయి. ఇప్పుడు అలాంటి దృశ్యమే పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలంలోని పలు గ్రామాల ప్రజలు చూసి సంప్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. సిటీ బస్సులు ఎరుగని ఆ మారుమూల గ్రామాలలో ఏకంగా ఓ జెట్ విమానం చక్కర్లు కొట్టడం చూసి ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు గత వారం రోజులుగా మండలంలోని ఆయా గ్రామాల మీదుగా ఆ జట్ విమానం తిరగడం అందరినీ కలవరపెడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో..? ఎటు పోతుందో తెలియదు కానీ ఆ పల్లెల్లో ఇండ్లపై నుంచి విమానం తిరుగుతుండడం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఆ జెట్ విమానం కు సంబంధించి అధికారుల వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మంగళవారం ఉదయం కూడా మళ్లీ జట్ విమానం భారీ శబ్దం చేసుకుంటూ ఇండ్లకు అతి సమీపంలోనే చెక్కర్లు కొట్టడం తో ఇక పోలీస్ అధికారులు అప్రమత్తమై సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.