Lawyer Vamanarao Couple Murder Case - న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ.. కీలక ఆదేశాలు

Lawyer Vamanarao Couple Murder Case - న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ.. కీలక ఆదేశాలు

ముద్ర,తెలంగాణ:-తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నిందితులను కూడా ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని పిటీషనర్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది.అప్పట్లో ఈ దారుణోదంతం తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది.

ప్రస్తుతం నిందితులంతా బెయిల్‌పై ఉన్నారని కోర్టుకు పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. వారి వాదనలు కూడా విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్‌వీఎన్ బట్టిల ధర్మాసనం స్పష్టం చేసింది. సీఐడీతో మరోసారి విచారణ జరిపించడానికి అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సుప్రీం ధర్మాసనం రికార్డు చేసింది. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించే విషయంపై సమాధానం చెప్పాలని నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలలో మరికొన్ని డాక్యుమెంట్లు సీడీలు అందించేందుకు పిటీషనర్‌కు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.