ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించిన రామగిరి ఎంపీడీవో రమేష్ సస్పెన్షన్

ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించిన రామగిరి ఎంపీడీవో రమేష్ సస్పెన్షన్
  • జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ముద్ర ప్రతినిధి,:పెద్దపల్లి: ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామగిరి ఎంపిడీఓ ఐ.రమేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కమాన్ పూర్ ఎంపిపి కార్యాలయానికి చెందిన ఎంపిడీఓ ఐ.రమేష్  డిప్యూటేషన్ పై రామగిరి ఎంపీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలలో పాటించాల్సిన ప్రోటోకాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 

ఎంపిడీఓ ఐ.రమేష్ తన కార్యాలయ విధుల పట్ల సైతం గౌరవపూర్వకంగా వ్యవహరించడం లేదని గమనించనైనదని, అనేక మార్లు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జనవరి 31న జరిగిన కార్యక్రమంలో సైతం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాత తేదీతో  ఉన్న శిలాఫలకం పెట్టి బాధ్యత రహితంగా ఉన్న కారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత సదరు ఎంపిడిఓను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఎంపిడిఓపై ఉన్న  క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, సస్పెన్షన్ కాలంలో సదరు ఉద్యోగి తన అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళవద్దని కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.