అధికారుల్లో టెన్షన్... టెన్షన్...!!

అధికారుల్లో టెన్షన్... టెన్షన్...!!
  • బదిలీలు తప్పవంటూ గుబులు
  • ప్రభుత్వం మారడంతో బదిలీ తప్పదంటున్న రాజకీయవర్గాలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాష్ట్రంలో రాజకీయ అధికారం బదిలీ కావడంతో అధికారుల్లో ఒక రకమైన
టెన్షన్ వాతావరణం అలుముకుంది. అధికార బిఆర్ఎస్ పార్టీని ఓడించి
కాంగ్రెస్ పార్టీ  అధికారం చేజిక్కించుకోవడంతో ఇప్పటికే అధికారపరంగా
పలుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో
పలు కీలకపోస్టులలో అధికారులను మార్చే యోచనలో ఉండగా ఆయా శాఖల మంత్రులు
కూడా తమ తమ శాఖల పరిధిలో పలువురు అధికారుల బదిలీకి కసరత్తులు
చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు జిల్లాస్థాయిలో కూడా ముఖ్యమైన శాఖలలో
కీలకపోస్టులలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా అధికార వర్గాల్లో పలువురు ప్రభుత్వం మారినదగ్గరనుంచి ఇదే చర్చ
ఎక్కడ చూసినా కనిపిస్తుంది, వినిపిస్తుంది. రాజకీయ అధికారం చేపట్టిన వారు
తమకు అనుకూలంగా ఉండే అధికారులతో స్వంత కోటరీ ఏర్పాటు చేసుకునే
వీలుంది. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతిగా ప్రవర్తించిన కొందరు
అధికారుల పేర్లను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద పేర్లు
రాసుకున్న రెడ్ డైరీలో పదిలంగా ఉంచుకున్నట్టు సమాచారం. అదేవిధంగా
ఆయా జిల్లాల స్థాయిలలో కూడా ఏఏ శాఖల, ఎవరెవరు, ఎందరిని మార్చాలో
ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఇంకా ప్రభుత్వం కుదురుకుని
కొంత వెసులుబాటు దొరికిన అనంతరం జిల్లాలపై దృష్టి సారించి ముఖ్యమంత్రి,
ఆయా శాఖల మంత్రులు, స్థానిక ఎంఎల్ ఏ లతో సమీక్షలు నిర్వహించిన
అనంతరం బదిలీలు తప్పక ఉంటాయని అధికారులే వ్యాఖ్యానించడం గమనర్హం.


ఈలోగా తమకు గతంలో అనుకూలంగా ఉన్న, లేదా వ్యతిరేకంగా ప్రవర్తించిన
అధికారులు, అనధికారులతో ఆయా శాఖల నుంచి సమాచారం
తెప్పించుకుంటున్నట్టు, పూర్తి సమాచారం వచ్చిన అనంతరం క్రోడీకరించి స్థానిక'శాసనసభ్యుల అభిప్రాయాలు, సంబంధిత మంత్రుల అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా బారీ ఎత్తున ఆయా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో కూడా పూర్తి స్థాయిలో బదిలీలు చేపడుతారని సమాచారం. అందుకే
ఇప్పటినుంచి ఆయా జిల్లాలో పని చేస్తున్న సమర్ధవంతమైన అధికారులు, నీతి,
నిజాయితీతో వ్యవహరించే అధికారులు, చేతివాటం ప్రదర్శించే అధికారులు,
ఉద్యోగాన్ని టైంపాస్కు తీసుకుని పనిచేసే అధికారులు, వారివారి సీనియారిటి,
సిన్సియారిటీని పరిగణలోనికి తీసుకుని బేరీజు వేసి వారి వారి పనితీరు ఆధారంగా
అక్కడే ఉంచాలా, ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలా అన్న జాబితాలు కూడా
త్వరలో సిద్దం అవుతున్నాయని పలు ఉద్యోగ సంఘాల నాయకులు
పేర్కొంటున్నారు.

అంతేగాకుండా ఒకేచోట అనేక సంవత్సరాలు తిష్టవేసినవారు,
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో చక్రం తిప్పుతున్నవారు,
ఆయా శాఖలలో లంచాలకు అలావాటుపడి సదరు డిపార్ట్మెంట్ ల పరువుతీసి
పలుచన అయినవారు ఇలా పలురకాల వారి వారి వివరాలు రహస్యంగా సేకరణ
జరిపే కార్యక్రమం ఇప్పటికే మొదలయ్యిందని, ఫలానా ఆఫీసరు ఎలాంటి వాడనే
విషయం ఆయా శాఖల కిందిస్థాయి సిబ్బందిని అడిగినా చెబుతుంటారని పలువురు
పేర్కొంటున్నారు. దీంతోబాటు స్థానికంగా ఉండనివారు, ఉండేవారు, ప్రైవేట్
ఆదాయం బాగా వెనకేసుకున్న వారు, సమర్ధత ఉన్నప్పటికీ రాజకీయంగా
పలుకుబడి లేక లూప్  లైన్ పోస్టులలో ఉన్నవారు, జోకుడుతో కీలకశాఖలో
తిష్టవేసినవారు, ప్రతిభ ఉన్నా ప్రాధాన్యతలేని శాఖలలో ఉన్నవారు ఇలా అనేక
కేటగిరీలుగా ఉద్యోగులను విభజించి పనితీరు, నైపుణ్యత, సీనియారిటీ,
సిన్సియారిటీలను లెక్కలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని
ఆయా శాఖల ఉద్యోగ సంఘల వారు చెబుతున్నారు. దీంతో ఎక్కడైనా
పనిచేస్తామని సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్నవారు సంతోషంగా ఉండగా
అక్రమార్కులు, అవినీతిపరులు మాత్రం ఎక్కడవేస్తారో, ఎటుపోవాలో అని కొంత
బెంగపడుతున్నారని తెలిసింది.