ఇటలీ దంపతులకు 'శిశు గృహ' బాలుని దత్తత

ఇటలీ దంపతులకు 'శిశు గృహ' బాలుని దత్తత

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఇటలీకి చెందిన పిల్లలు లేని దంపతులకు కరీంనగర్ లోని శిశు గృహలో పెరుగుతున్న బాలుడిని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో సోమవారం దత్తతకు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్న దంపతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దత్తత తల్లిదండ్రుల వృత్తి వివరాలు, ఆర్థిక పరిస్థితి, నివాస వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. దత్తత స్వీకరించిన బాబు యొక్క భవిష్యత్తుకు తీసుకోబోయే చర్యల గురించి వారితో మాట్లాడారు. ఇటలీ దేశంలో అందించే విద్య, ఆరోగ్యం సౌకర్యాలను దత్తత తల్లిదండ్రులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దత్తత ఉత్తర్వులను ఇటలీ దంపతులకు అందజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జారీ అయిన బాబు జనన ధ్రువపత్రం కూడా అందజేశారు.


ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఏం.సరస్వతి మాట్లాడుతూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నియమాల ప్రకారం ఇటలీ దంపతులకు కరీంనగర్ శిశు గృహాలో పెరుగుతున్న ఆరు సంవత్సరాల బాబును దత్తతకు ఇచ్చామని తెలిపారు. బాబు తల్లిదండ్రులతో ఇటలీ వెళ్ళేందుకుగాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయం నుండి పాస్ పోర్టు కూడా ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, మార్కెటింగ్ డిడి పద్మావతి, డి సి పి ఓ శాంత, ఐసిపిఎస్ సిబ్బంది తిరుపతి, తేజస్వి పాల్గొన్నారు.