సూర్యాపేట పట్టణంలో బిఆర్ ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసిన కౌన్సిలర్లు

సూర్యాపేట పట్టణంలో బిఆర్ ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసిన కౌన్సిలర్లు
  • పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదు
  • నిధులు కేటాయించకుండా వార్డులలో అభివృద్ధి ని నిర్లక్ష్యం చేశారు

ముద్ర ప్రతినిధి,సూర్యాపేట:- జనవరి నెలలో మున్సిపల్ చైర్ పర్సన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపో యిన నెలరోజుల తరువాత నిన్న ఆదివారం నాడు బిఆర్ ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను, ఆమె భర్త దిలీప్ రెడ్డి ని బిఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ప్రకటించడాన్ని  అసమ్మతి కౌన్సిలర్ లు తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు కొండపల్లి దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  తామంతా బిఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని 17 మంది కౌన్సిలర్ లు తెలిపారు.  ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్ లు మాట్లాడుతూ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గెలుపు కోసం పనిచేసి గెలిపించిన కౌన్సిలర్ ల పట్ల  ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బిఎస్పి లో చేరిన వారికి గౌరవం ఇవ్వడం  వారి ఇంటికి వెళ్లి పరామర్శించారని,  అదే సంఘటనలో గాయబడిన కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను మాజీ మంత్రి పరామర్శ చేయకపోవడం తమకు భాధను కలిగించిందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ను కాపాడుకోవడానికి బిఎస్పి పార్టీ లో చేరిన కౌన్సిలర్ లకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు.

మాజీ మంత్రి నియంత్రత్వ వైఖరికి నిరసనగా తామంతా బిఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.  గత నాలుగు సంవత్సరాల నుండి కౌన్సిలర్ లకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేపిస్తూ, మున్సిపల్ పాలకమండలిని నిర్వీర్యం చేసి చైర్ పర్సన్ ను నామమాత్రపు అధికారాలతో మున్సిపాలిటీ వ్యవహారాలను కమీషనర్ ద్వారా నడిపించారని ఆరోపించారు. ప్రజల మద్యన తిరిగే కౌన్సిలర్ లంటె జగదీష్ రెడ్డి కి ఏనాడు గౌరవం లేదని వారు తెలిపారు. అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో పెద్దఎత్తున అవినీతి కి పాల్పడినారని విమర్శించారు. బిఆర్ ఎస్ పార్టీ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని, కేవలం భజనపరులతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలో జగదీష్ రెడ్డికి మెజారిటీ తీసుకుని వచ్చింది తామేనని వారు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తానంతా ఐక్యతతో పనిచేసి బిఆర్ ఎస్ పార్టిని ఓడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అసమ్మతి కౌన్సిలర్ లు పాల్గొన్నారు.