తుంగతుర్తి బిఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తారనే ఊహాగానాలకు చెక్ పెట్టిన మంత్రి కేటీఆర్

తుంగతుర్తి బిఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తారనే ఊహాగానాలకు చెక్ పెట్టిన మంత్రి కేటీఆర్
  • ముచ్చటగా మూడోసారి పోటీలో గాదరి ప్రకటించిన కేటీఆర్
  • ఎమ్మెల్యే గాదరిని 40 వేల మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు
  • భారీ బహిరంగ సభ తో ఎన్నికల శంఖారావం పూరించిన బిఆర్ఎస్ పార్టీ
  • నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అంటున్న  బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం నుండి ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన తుంగతుర్తి ప్రగతి నివేదన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు .ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి కావాలంటే తుంగతుర్తి నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా 40 వేల మెజార్టీతో గాదరి కిషోర్ కుమారును ప్రజలు ఆశీర్వదించాలని కేటీఆర్ అన్నారు.

గత కొంతకాలంగా తుంగతుర్తి అభ్యర్థిని మారుస్తారని మాట వినవస్తున్న తరుణంలో కేటీఆర్ భారీ బహిరంగ సభలో రెండుసార్లు విజయం సాధించిన గాదరి కిషోర్ కుమార్  తుంగతుర్తి నియోజకవర్గం నుండి మూడోసారి పోటీలో ఉంటారని హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ప్రకటించడంతో వేలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలు ఆనందంతో కరతాల ధ్వనులు చేశారు. స్వయంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తుంగతుర్తి అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అని ప్రకటించడంతో తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు భారీ మెజార్టీ రావడం ఖాయమని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు వివిధ రకాల కథనాలు రావడం కేటీఆర్ ప్రకటనతో వాటిని తెరపడడం జరిగింది.

ఇక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గెలుపు తద్యమని భారీ మెజారిటీ కోసం కృషి చేస్తామని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా తిరుమలగిరి భారీ ప్రగతి నివేదన సభ తో ఒకపక్క ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అభ్యర్థి అని తేల్చడం రెండో పక్క వేలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలతో విపక్షాలకు విజయం తమదేనని సవాల్ విసరడం ఒక దెబ్బకు రెండు పిట్టల్లా మారింది .ఇప్పటి వరకు విపక్షాల అభ్యర్థులు ఎవరో ఇంకా తెలియ రాలేదు దీంతో నియోజకవర్గంలో ప్రస్తుతం వార్ వన్ సైడ్ గా కనిపిస్తుంది. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ మేరకు మెజార్టీ సాధిస్తారో అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మేరకు  నిజం చేస్తారో  వేచి చూడాల్సిందే.