జంకుతున్న... జనం....! ఊహించని స్థాయిలో ఉష్ణోగ్రతలు..

జంకుతున్న... జనం....!  ఊహించని స్థాయిలో ఉష్ణోగ్రతలు..

కోదాడ,ముద్ర: మూడు రోజులుగా కోదాడ డివిజన్ లో వాతావరణం లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుముందే భారీగా పెరిగి ఉన్న  ఉష్ణోగ్రతల తో  పాటు  వడగాల్పులు మొదలయ్యాయి. నిప్పుల కుంపటిలా ఉన్న వాతావరణంలో వడగాల్పులు  ప్రజానీకాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా గాడ్పులు తగ్గడం లేదు. కుంపటి వద్ద ఉన్న సెగ మాదిరిగా  గాలిలో   సెగలు వస్తున్నాయి. 1 గంట సమయంలో పరిస్థితి మహా భయంకరంగా మారింది. జనం ఎండలో బయటికి వెళ్ళాలి అంటే జంకుతున్నారు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. ఈ క్రమంలోనే పోటీ పరీక్ష లకు సిద్ధం అయ్యే విద్యార్థులు వడగాల్పుల కు పడిపోతున్నారు. కోచింగ్ లకు వెళ్లి వచ్చే వరకు ఒంటి గంట  దాటడంతో ఎండకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి కూలి నిమిత్తం, చిరు వ్యాపారల నిమిత్తం ఆటోల్లో, ద్విచక్ర వాహనాల పై వచ్చే వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

రోహిణి కార్తి ప్రవేశించకముందే వడగాల్పులు విజృంభించడంతో  ప్రజలు ఆవేదన  చెందుతున్నారు. ఎండకు వడగాల్పులు కు భయపడి జనం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. జనంతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు కూడళ్ళు పగటిపూట జన సందడి లేక బోసిపోతున్నాయి. జన సంచారం లేక కొన్ని సందర్భాల్లో  కర్ఫ్యూ విధించినా మాదిరిగా వీధులు కనిపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలు చేసుకునే తోపుడుబండ్ల వారు కూరగాయల దుకాణాలు చిన్నచిన్న  దుకాణాలు పండ్లు అమ్మేవారు శీతల పానీయాలు అమ్మేవారు ఎండ ధాటికి తట్టుకోలేక పోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా జనం బయటికి రావడం లేదని వ్యాపారం సహితము నడవడం లేదని వాపోతున్నారు. గత యాభై అరవై ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు ఈ ఏడాది చూస్తున్నామని  పెద్దమనుషుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వేడి గాలుల కారణంగా ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమశీతోష్ణ మండలాల్లో కూడా భూ గమనంలో మార్పులు రావడంతో  ఉష్ణ మండలాలను తలిపిస్తున్నాయి. భూమ్మీద కాలుష్యం పెరగడమే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడానికి కారణమని పర్యావరణ వేత్తలు ఎవరు చేస్తున్నారు. పారిశ్రామికీకరణ పేరుతో చెట్లను నరికి వేయడం మూలంగా గ్రీన్ ఎఫెక్ట్ వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్ అధికమై  అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు కు కారణం అవుతుంది అంటున్నారు అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు పక్షులు క్రిములు కీటకాలు  విలవిలలాడి పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితి లోనే ఈ విధమైన వాతావరణ పరిస్థితులు చూస్తుంటే  రాబోయే రోజుల్లో మరింత జటిలమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూన్నారు.