జనగామలో ‘కొమ్మూరి’కి   లైన్‌ క్లీయర్

జనగామలో ‘కొమ్మూరి’కి   లైన్‌ క్లీయర్
  • కాంగ్రెస్‌ వర్గపోరుకు చెక్‌ పెట్టిన డీసీసీ ప్రెసిడెంట్‌
  • ప్రతాప్‌రెడ్డితో కలిసి పనిచేస్తాం..
  • పొన్నాల వర్గీయుల తీర్మానం

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామలో ‘హస్త’వ్యస్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిందా.. అంటే అవును అనే సమాధానం వస్తుంది. సీనియర్‌‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీని వీడడంతో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఓ పక్క లైన్‌ క్లీయర్‌‌ కావడంతో పాటు జనగామలో వర్గపోరుకు చెక్‌ పడినట్టయ్యింది. ఇంకాలం పొన్నాలతో పనిచేసిన ఒకరిద్దరు కార్యకర్తలు తప్ప మిగతా వారంతా కొమ్మూరి నాయకత్వంలో పనిచేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు గురువారం జనగామలోని ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానం కూడా చేసుకున్నారు. నియోజవర్గంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 

ఈ సమావేశానికి డీసీసీ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని సూచించారు. ఇదే సమయంలో జనగామ నుంచి పోటీ చేస్తున్న స్థానికేతరుడైన పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిని తరిమి కొట్టాలని పిలపునిచ్చారు. జనగామ నియోజకవర్గంలో  కాంగ్రెస్ జెండా ఎగురవేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. ఇందుకు ఈ 45 రోజుల పాటు ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ అబ్జర్వర్ శారద, జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా, కొన్నే మహేందర్ రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్ వడ్లకొండ వంగాల మల్లారెడ్డి, జనగామ మండల సీనియర్ నాయకులు బడికే కృష్ణ స్వామి, కట్ట కృష్ణ, కాముని శ్రీనివాస్, జనగామ మున్సిపల్ కౌన్సిలర్ వంగల కళ్యాణి, ఈర్ల లక్ష్మణ్, కాముని జయ, ఎం. డి యాసిన్, రాజీరెడ్డి,  కురకుల నాగరాజు,గుజ్జుల మధు, సుదాగని కృష్ణ, సర్వర్, కాముని శ్రీనివాస్, కురేముల రవి, యసారపు పరుశురాములు, యూత్ కాంగ్రెస్ జనగామ మండల బల్నే నరేష్, బత్తిని నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వైపు బీఆర్‌‌ఎస్‌ లీడర్ల చూపు...

ఇక అధికార బీఆర్‌‌ఎస్‌లో లీడర్లు కూడా కొంతమంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నాటి టీఆర్‌‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేసిన లీడర్లు, ఉద్యమకారులకు ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మనదనపడుతున్నారు. ఈ క్రమంలో వారంతా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. పార్టీ హైమాండ్‌ టికెట్‌ విషయంలో కొంత తాత్సారం చేసి చివరకు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన పల్లా కూడా వలస నేతలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో ఉద్యమకారులుగా పనిచేసిన లీడర్లంతా బీఆర్‌‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌‌ఎస్‌కు చెందిన కొందరు నియోజకవర్గ నాయకులు డీసీసీ ప్రెసిడెంట్‌ కొమ్మూరితో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు మరింత బలం పెరగడం ఖాయమనిపిస్తోంది. ఏదీ ఏమైనా కాంగ్రెస్‌లో ఉన్న వర్గపోరుకు చెక్‌ పెట్టిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీలో అసంతృప్తి వాదులను సైతం తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.